నెలాఖరులోగా కీలక పోస్టులు ఖాళీ
- దక్షిణ డిస్కం సీఎండీ,ఐదుగురు డెరైక్టర్ల పదవీ కాలం పూర్తి
- ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో నెలాఖరులోగా ఆరు కీలక పదవులు ఖాళీ అవుతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) జి.రఘుమారెడ్డి పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. ఇదే సంస్థ ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ జి.శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ బి.నర్సింగ్‌రావు, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) మానవ వనరుల విభాగం డెరైక్టర్ ఎస్.అశోక్‌కుమార్, తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో) ట్రాన్స్మిషన్ విభాగం డెరైక్టర్ టి.జగత్‌రెడ్డి, గ్రిడ్ విభాగం డెరైక్టర్ జి.నర్సింగ్రావుల పదవీకాలం సైతం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. టీఎస్ఎస్పీడీసీఎల్లో ఫైనాన్స్, కమర్షియల్ విభాగాలకు సంబంధించిన రెండు డెరైక్టర్ల పదవులు ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఖాళీ డెరైక్టర్ పదవుల సంఖ్య ఏడుకు పెరగనుంది.
టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, మరో ఐదుగురు డెరైక్టర్ల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో వారి పదవీకాలాన్ని పొడిగించి మరో దఫా అవకాశం కల్పించాలా? లేక కొత్త వారిని నియమించాలా? అన్న అంశంపై ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పనితీరు, సమర్థత ఆధారంగా వీరిలో కొందరికి పొడిగింపు లభించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖలో అత్యంత కీలకమైన టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ పోస్టుపై విద్యుత్ శాఖ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మరో దఫా పొడిగింపుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. పదవీ విరమణ చేసిన పలువురు అధికారులు సైతం తమకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలిసింది. టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఎ.గోపాలరావును నియమించాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించిన వెంటనే అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే తరహాలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ, డెరైక్టర్ల పదవీకాలం ముగింపు రోజే సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారని, అప్పుడే ఉత్తర్వులు జారీ అవుతాయని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.