రాష్ట్రంలో డెంగీ జోరు
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 48 శాతం మేర ఎక్కువగా నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. వర్షాలు ప్రారంభం కావడంతో అంటువ్యాధుల జోరు పెరుగుతుందేమోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు.. చంద్రాపూర్ జిల్లాలో ఎక్కువగా డెంగీ కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి జూన్ వరకు దాదాపు 350 డెంగీ కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్షాలు కురిసినపుడు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిలో దోమలు బాగా వృద్ధి చెందుతాయని, అందువల్ల ఈ కాలంలోనే డెంగీ కేసులు ఎక్కువాగా నమోదవుతాయని జస్లోక్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఓం శ్రీవాస్తవ తెలిపారు.
ఈ దోమల వృద్ధిని నిరోధించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన నగరప్రజలకు సూచించారు. విద్యార్థులకు కూడా నిల్వఉన్న నీటిలో దోమల వృద్ధిపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో డెంగీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రబలుతున్న వ్యాధిగా తేలిందని ఆయన వివరించారు.
విద్యార్థులకు అవగాహన
దోమల వృద్ధిపై పాఠశాల విద్యార్థులకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారుల అవగాహన కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాలలో నీరు నిల్వకుండా జాగ్రత్తపడాలని, వీటి వల్లనే వీటి ద్వారా దోమలు వృద్ధి చెంది రోగాల బారినపడతామంటూ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద కార్పొరేషన్ వైద్యులు కొంతమంది ఇప్పటికే పాఠశాలలకు వెళ్లి మరీ అవగాహన కల్పిస్తున్నారు. దోమల వృద్ధిని ఎలా గుర్తించాలి? వాటిని ఎలా నియంత్రించాలి? తదితర అంశాలను విద్యార్థులకు వారు బోధిస్తున్నారు.
ఈ విధానాన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా విస్తరించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. కాగా 55 శాతం డెంగీ కేసులు భవనాలలో నివాసముంటున్న వారికి అదేవిధంగా నాన్ స్లమ్ ఏరియాలో ఉంటున్న వారిలోనే నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా 85 శాతంమందికి ఇంటిలో పుట్టిన దోమల వల్లనే డెంగీ వ్యాపించిందని ఓ సర్వేలో తేలింది. కాగా 2013లో కార్పొరేషన్ ఆస్పత్రులలో 927 డెంగీ కేసులు నమోదుకాగా, వాటి బారినపడి 11 మంది మరణించారు. ఈ ఏడాది జనవరి నుంచి నగరంలో 168 డెంగీ కేసలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదయ్యాయి.