‘హారన్ ఓకే ప్లీజ్’ ఇక వద్దు
- లారీల వెనక ఇలాంటి సంకేతాలు రాయకూడదని రవాణా శాఖ ఆదేశం
- ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ
సాక్షి, ముంబై: రవాణా వాహనాల వెనుక ‘హారన్ ఓకే ప్లీజ్’ అన్న సంకేతాలను తొలగించాలని రాష్ర్ట రవాణా శాఖ ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా రాయడం వల్ల వెనక వస్తున్న వాహనదారులకు తప్పుడు సమాచారం వెళుతుందని పేర్కొంది. ట్రక్కు, టెంపో వంటి సరుకులు చేరవేసే భారీ వాహనాల వెనక భాగంలో హారన్ ఓకే ప్లీజ్ అని రాసి ఉండడం అందరికి తెలిసిందే.
అయితే దాని వెనకు ఉన్న అసలు ఉద్దేశం.. రవాణా శాఖ నియమాల ప్రకారం ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే (ఓవర్టేక్) సమయంలో హరన్ కొట్టాలి. అయితే ఈ విషయం తెలియక అనవసర సమయాల్లో కూడా హారన్ కొట్టడంతో పక్క వాహన చోదకులు ఇబ్బందులు పడుతుంటారు. ముందు వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముంది. లోడుతో వెళుతున్న భారీ వాహనాలకు వెనక వస్తున్న సరిగా కనబడదు. దీంతో ఓవర్ టేక్ సమయంలో ప్రమాదం జరిగే ఆస్కారముంటుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాన్ని అధిగమించే సమయంలో హారన్ కొట్టాలని దాని సందేశం. మరో సందేశమేమిటంటే పదే పదే హారన్ కొట్టి విసిగించవద్దు, మీరు కొట్టిన హారన్ చాలు వీలు దొరకగానే ఓవర్ టేక్ చేసేందుకు అవకాశం ఇస్తామని దాని అర్థం. కాని అలా రాసిన సందేశంవల్ల హారన్ ఎక్కడైన కొట్టవచ్చని కొందరు భావిస్తున్నారు. ఆ సందేశాన్ని సరిగా అర్థం చేసుకోక అనేక మంది డ్రైవర్లు అనవసరంగా హారన్ కొడుతూ రోడ్డుపై వెళుతున్న వారిని, ముందు వెళుతున్న వాహన చోదకులను విసిగెత్తిస్తుంటారు.
హారన్ ఓకే ప్లీజ్ అంటే ఇష్టమున్న చోట హార్న్ కొట్టవచ్చని కొందరు భావిస్తున్నారని రవాణ శాఖ అభిప్రాయపడింది. దీంతో ఆ సందేశాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. గత సంవత్సర కాలంలో రవాణ శాఖ పోలీసులు అనవసరంగా హారన్ కొట్టి ధ్వని కాలుష్యం చేస్తున్న 15,534 మంది డ్రైవర్లపై చర్యలు తీసుకున్నారు. వారి నుంచి రూ.13.25 లక్షలు జరిమానా వసూలు చేశారు.