కర్నూలు జెడ్పీ ఎన్నికను కోర్టులో సవాల్ చేస్తాం
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డితో వైఎస్ఆర్ సీపీ ప్రతినిధుల బృందం బుధవారం భేటీ అయ్యింది. పలు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణలో అధికార పార్టీకి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఈసీని కోరారు. భేటీ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి మాట్లాడుతూ కర్నూలు, నెల్లూరు, ప్రకాశం కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రభుత్వం ఆదేశాలు అమలుకే అధికారులు పరిమితం అయ్యారన్నారు. నిష్పక్షికంగా వ్యవహరించాలన్న కనీస ఇంగిత జ్ఞానం మరిచి వ్యవహరించారన్నారు.
అధికార పార్టీకి సహకరించిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కోరామని మైసూరారెడ్డి తెలిపారు. కర్నూలు జెడ్పీ ఛైర్మన్ ఎన్నికను కోర్టులో సవాల్ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను అందచేసామని మైసూరా తెలిపారు.