‘ఉదయ్’తో ఒరిగిందేమీ లేదు
టీనగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి నత్తం విశ్వనాథన్ ఆరోపించారు. కేంద్రమంత్రి గోయల్ తన స్థాయిని మరచి మాట్లాడడం సరికాదన్నారు. ప్రజల పొట్టగొట్టే పథకాన్ని విద్యుత్ సంస్కరణల చట్టం పేరుతో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యుత్, ప్రత్యామ్నాయ ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో పవన విద్యుత్‌కు సంబంధించిన ఒక ప్రశ్నకు బదులిస్తూ తన స్థాయిని మరచి మాట్లాడారని విమర్శించారు.
రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు వీలు కాలేదని ఒక కుంటిసాకును తెలపడమే గాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకానికి సంబంధించిన ఒప్పందంలో తమిళనాడు ప్రభుత్వం ఇంకా సంతకం చేయలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారన్నారు. ఈ ఉదయ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ప్రజల కోసమే పథకాలు ఉన్నాయని, పథకాల కోసం ప్రజలు లేరనేది ముఖ్యమంత్రి అభిప్రాయమన్నారు. ఉదయ్ పథకం ఎటువంటి పరిస్థితుల్లోను రాష్ట్రానికి సరిపడదనేది తేటతెల్లమవుతోందన్నారు.
అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యం: డి.రాజా
రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో అన్నాడీఎంకే ప్రభుత్వం విఫలమైందని కమ్యూనిస్టు జాతీయ కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. చెన్నై టీనగర్‌లోగల సీపీఐ ప్ర ధాన కార్యాలయం బాలన్ ఇల్లంలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పరిరక్షిం చేందుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం అవసరమని అన్నా రు. డీఎండీకే-మక్కల్నల కూట్టనితో కూటమి ఏర్పడిందని, ఇందుకు సీపీఐ కేంద్ర కమిటీ కూడా స్వాగతించిందన్నారు. అదే విధంగా ప్రజలు కూడా స్వాగతిస్తారనే నమ్మకం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా వున్న పియూష్ గోయల్‌కు తమిళనాడులో ఎటువంటి అభివృద్ధి పథకం నెరవేర్చేందుకు ముఖ్యమంత్రిని చూసేందుకు వీలుకాలేదని పేర్కొన్నారు.
సీఎం దర్శనం దుర్లభం: తమిళిసై
దేశ ప్రధానిని సులభంగా కలుసుకోవచ్చని, అయితే రాష్ట్ర సీఎం, ఇతర మంత్రులను కలుసుకోవడం అసాధ్యమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏర్పడిన వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చి వరద బాధిత ప్రాంతాలను సందర్శించారని, అంతవరకు వరదలను పరిశీలించని ముఖ్యమంత్రి మోడీ వస్తున్నారని తెలియడంతో అత్యవసరంగా వరద ప్రాంతాలను సందర్శించారన్నారు. ప్రధానిని సామాన్య ప్రజలు కూడా సులభంగా సందర్శించుకోవచ్చని, ప్రధానిని చూసేందుకు అన్నాడీఎంకే ఎంపీలకు అనుమతి లభించడం లేదనేది అంగీకార యోగ్యం కాదన్నారు.