విత్తన క్షేత్రానికి నిర్లక్ష్యం చీడ
బూర్జ : మండలంలోని పెద్దపేట విత్తనాభివృద్ధి క్షేత్రం ఒకప్పుడు ఉత్తరాంధ్రకే తలమానికం. ఇప్పుడు నిర్లక్ష్యం చీడ ఆవరించి... సమస్యలతో సతమతమవుతోంది. దీన్ని పట్టించుకునే నాథుడు కరువవ్వడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. 1961లో 122ఎకరాల విస్తీర్ణంలో ఈ విత్తనాభివృద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యవసాయ పరిశోధనా క్షేత్రం నుంచి సరఫరా అయిన విత్తనాలు వేసి ఇక్కడ ఉత్పత్తయిన పౌండేషన్ సీడ్‌ను జిల్లా కేంద్రానికి తరలించి అక్కడి నుంచి జిల్లాలోని రైతులకు విత్తనాలు అందజేసేది. ఇక్కడి విత్తనాలు చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఎగుమతి అవుతుండేవి. ఏటా 80ఎకరాల విస్తీర్ణంలో సేద్యం చేపట్టి విత్తనాలు సిద్ధం చేసేవారు.
కూలీల కొరత, వర్షాబావం, సాగునీటికొరత, నీటినిల్వకోసం ఏర్పాటు చేసిన చెరువులు పూడుకు పోవటం వంటి సమస్యలు దీని మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గత ఏడాది 55 ఎకరాల భూమిలో వరి పండించారు. ప్రతి ఏడాది మార్చి నెలలో ప్రోసెసింగ్ చేసి విత్తనాలు సిద్ధం చేసి గన్నీబేగ్‌లో లోడుచేసి నిలువ వుంచుతారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశాక వీటిని ఏఓలకు సరఫరా చేస్తారు. గత ఏడాది సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ మండలంలోని రైతులను నాశనం చేసిప్పటికి క్షేత్రంలోని పంటలకు సకాలంలో సాగునీరందించి మేలు చేసింది. అయినా అధికారుల నిర్లక్ష్యం,ప్రజాప్రతినిధుల అలక్ష్యం వెరసి క్షేత్రం నాశనమవుతోంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
ఈ క్షేత్రంలో ఒక మేనేజర్, ఏఈఓ, ముగ్గురు వాచ్మన్లు ఉండాలి. పెర్మినెంట్‌గా ఒక్క వాచ్‌మన్ తప్ప ఎవ్వరూలేరు. మేనేజర్‌గా వీరఘట్టం ఏఓ స్వర్ణలతకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఏఈఓగా బూర్జ ఏఈఓ సురేష్‌ను తాత్కాలికంగా వారం రోజుల నుండి డెప్యుటేషన్‌పై ఈ సీజన్లో నియమించారు. ఇన్చార్జి అధికారుల్లో చిత్తశుద్ధి లోపించి అనుకున్నస్థాయిలో విత్తనాభివృద్ధిని సాధించడంలేదు.
సకాలంలో సాగని వ్యవసాయం
రాష్ట్రంలో రైతులంతా విత్తనాలు వేసి వరినారును ఏపుగా పెంచుతూ నాట్లు వేసేందుకు నానా తంటాలు పడుతూ ఖరీఫ్‌సీజన్‌కి సిద్ధమైనా అన్నీ తెలిసిన వ్యవసాయశాఖ అధికారులు మాత్రం ఇంకా క్షేత్రంలో దుక్కులు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పది సంవత్సరాలుగా ఇక్కడ సమయానికి ఉభాలు చేయరు. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గుతోంది. ఇక్కడ మామిడి, చింత చెట్లు ఉన్నాయి. వాటి ఆదాయం ఏమవుతుందో తెలియటం లేదు. క్షేత్రానికి సంబంధించిన ట్రాక్టర్, ఇంజిన్లు వంటి యంత్రాలు మూలకు చేరాయి. ఓనిగెడ్డ నుంచి నీరు విడుదలైతేకాని ఇక్కడ నాట్లు పడవు, ప్రభుత్వం కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించక పోవటంతో ఇక్కడ పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు. బయటపనులు లేనప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తుంటారు. కూలీలు ఎప్పుడు దొరికితే అప్పుడే ఇక్కడ ఉభాలు ప్రారంభిస్తారు.
క్షేత్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు
=1966లో ఏర్పాటు చేసిన వ్యవసాయబావులు అడుగంటి పోయాయి.
= 1994లో ఒక వ్యవసాయబావి నిర్మించి పక్కనే పంపుషెడ్ నిర్మించి విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. మూడేళ్ళ క్రితమే అవన్నీ మూలకుచేరాయి.
= 2007లో రూ. ఆరు లక్షలతో సాగునీటి నిలువ కోసం 5చెరువులు తవ్వారు. వీటి నిర్వహణ సక్రమంగా చేపట్టక పోవటంతో గత ఏడాది సంభవించిన మూడు తుఫాన్ల కారణంగా అధిక వర్షాలు కురిసినప్పటికి నీరునిలువ వుండలేదు. తుప్పలు, డొంకలు ఏపుగా పెరగటంతో మిగిలిన భూములు బీడుభూములుగా మారాయి.
= 2సిమెంటు కల్లాలు పూర్తిగా పాడయ్యాయి, సిబ్బంది క్వార్టరు, విత్తనాలు నిలువచేసే గోడౌన్, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రహ రీ లేక క్షేత్రం ఆక్రమణలపాలవుతోంది.
= ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ ప్రతిపాదనలు పంపించారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా ఈ క్షేత్రం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాదికారులు స్పందించి ఈ క్షేత్రాన్ని ప్రగతి పధంలో నడిపించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.