బీజేపీ వల్లనే తెలంగాణ: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు లేకున్నా తెలంగాణ ఏర్పాటుకోసం చిత్తశుద్ధితో వ్యవహరించి, పార్లమెంటులో బిల్లుకు మద్దతు ఇవ్వడం వల్లనే రాష్ట్ర ఏర్పాటు కల నెరవేరిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్రావిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ సీనియర్ నేతలు జి.కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, ఎన్.రామచందర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, అమర్‌సింగ్ తిలావత్ పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ 1969 నుంచి 2014 దాకా ఎంతోమంది త్యాగధనులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే సమయంలో ఎన్నో కుట్రలు జరిగినా రాష్ట్ర ఏర్పాటువైపే పార్టీ నిలబడిందన్నారు.