మార్గం...సుగమం
కీలక మెట్రో స్టేషన్లకు తొలగిన అడ్డంకులు
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండానిర్మాణానికి ఆదేశం
పాత గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ‘సైనిక్ ఆరాంఘర్’ అధికారులతో సీఎస్ సమీక్ష
సిటీబ్యూరో: మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. అమీర్‌పేట్, పరేడ్‌గ్రౌండ్స్ ప్రాంతాల్లో రెండు మెట్రో కారిడార్లు కలిసే చోట ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. అమీర్‌పేట్ ప్రాంతంలో ఆరు ఆస్తులను తొలగించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో రక్షణ శాఖ స్థలాలు లభించాయి. నాంపల్లి ప్రధాన రహదారిపై మెట్రో స్టేషన్ నిర్మాణానికి వీలుగా ఐదు భవంతులను తొలగించినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనుల పురోగతిని హెచ్ఎంఆర్ ఎమ్డీ ఎన్వీఎస్ రెడ్డి ఆయనకు వివరించారు. ప్రధాన రహదారులపై పిల్లర్లు, పునాదుల నిర్మాణం వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు. రెండు వారాలుగా కీలక ప్రాంతాల్లో 19 ఆస్తులను అడ్డు తొలగించడంతో మెట్రో పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మధురా నగర్లో శ్రీవేణి టవర్స్ భారీ భవంతిని అడ్డు తొలగించడంతో పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. కృష్ణానగర్ ప్రాంతంలోనూ ఆరు ఆస్తులను సేకరించామని వివరించారు. పాత గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని రెండెకరాల సువిశాల స్థలంలో సైనిక్ ఆరాంఘర్ నిర్మించనున్నట్లు తెలిపారు. పరేడ్‌గ్రౌండ్స్ వద్దనున్న రక్షణ శాఖ స్థలాన్ని మెట్రో పనులకు అప్పగించిన నేపథ్యంలో ఈ నిర్మాణం చేపడుతున్నామన్నారు. మెట్రో పనులు వేగంగా జరుగుతుండడం పట్ల హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులను సీఎస్ అభినందించారు.
ట్రాఫిక్ చిక్కులు లేకుండా...
ప్రధాన రహదారులపై మెట్రో పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా చూసేందుకు హెచ్ఎంఆర్ ఎమ్డీ, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. జలమండలి, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు మెట్రో పనులకు వీలుగా పైప్లైన్లు, కేబుల్స్‌ను వేరొక చొటకు మార్చాలని ఆదేశించారు. ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ఎల్ సంస్థకు అవసరమైన సహకారం అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేశం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు నిర్మల, రఘునందన్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.