State industries
-
ప్రపంచస్థాయి పరిశ్రమలకు ఏపీ అనుకూలం
సాక్షి, అమరావతి : సహజ సిద్ధమైన నిక్షేపాలు, వనరులు, అవకాశాలు అపారంగా కలిగిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. ముంబైలో సోమవారం జరిగిన గ్లోబల్ కెమికల్స్, పెట్రో కెమికల్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయన్నారు. ప్రపంచస్థాయి పరిశ్రమలకు ఏపీలో అన్ని విధాల అనుకూల వాతావరణం ఉందన్నారు. భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి ఈ సదస్సు ఒక వేదికలా ఉపయోగపడుతుందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ పరుస్తామని మేకపాటి చెప్పారు. పెట్టుబడులకు గల అవకాశాలు, అనుకూల రంగాలను సదస్సులో మంత్రి వివరించారు. ఏపీ తీరంలో గ్యాస్, చమురు, పెట్రోలియం వంటి సహజ వనరులు భారీగా ఉన్నాయని.. అవే రాష్ట్రానికి అరుదైన సహజ సంపదగా అభివర్ణించారు. విశాఖ–కాకినాడ మధ్యలో ఏర్పాటుచేయనున్న పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) కారిడార్ పెట్టుబడుల గురించి కూడా మంత్రి వివరించారు. ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్రంలో పర్యటించి ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వరంగ సీఎండీలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించిన విషయాన్ని సదస్సులో మేకపాటి ప్రస్తావించారు. కాగా, కేంద్రం 2025 కల్లా 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని నిర్దేశించుకుందని.. ఇందులో కోస్టల్ కారిడార్, పెట్రో కెమికల్ కారిడార్లే గ్లోబల్ ఎకానమీలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచాలన్నదే తమ ప్రధాన ధ్యేయమని మేకపాటి స్పష్టంచేశారు. -
చేనేత ప్రచారకర్తగా కేటీఆర్..
-
చేనేత ప్రచారకర్తగా కేటీఆర్..
ఆ వస్త్రాలు ధరించి సచివాలయానికి వచ్చిన మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, చేనేత మంత్రి కె.తారకరామారావు చేనేత ప్రచారకర్తగా మారారు. చేనేత దస్తులు ధరించి వచ్చి సోమవారం సచివాలయంలో సందడి చేశారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరిం చాలని పిలుపునిచ్చిన మంత్రి.. సోమవారం స్వయంగా ఆ వస్త్రాలు ధరించి వచ్చారు. మంత్రి పిలుపు మేరకు ఆయన కార్యాలయం అధికారులు, సిబ్బంది కూడా ఆ దుస్తులే ధరించి రావడంతో ప్రత్యేకత సంతరిం చుకుంది. ఇక నుంచి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని మంత్రి తెలిపారు. దీని ద్వారా చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్తామన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులకు ప్రచారం కల్పిం చేందుకు తెలంగాణ చేనేత శాఖ (టెస్కో) ద్వారా మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పిలుపుతో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమి షనర్లు, ఇతర శాఖల అధికారులు సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారని మంత్రి కార్యాలయం తెలిపింది. పరిశ్రమలు, ఐటీ, పురపాలక, చేనేత శాఖల విభాగాధిపతులు, ఉద్యో గులు సైతం చేనేత దుస్తుల్లో వచ్చి మంత్రి కేటీఆర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, జల మండలి ఎండీ దానకిశోర్, టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్ తదితరులు తమ ఉద్యోగుల బృందంతో మంత్రిని కలిశారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తామని మంత్రికి మాట ఇచ్చారు. -
పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ కు బాధ్యతలు
పరిశ్రమల శాఖ అనుబంధ విభాగాల పనితీరుపై ఆరా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా కె.తారకరామారావు మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు... మంత్రిత్వ శాఖల మార్పిడిలో భాగంగా తాజా శాఖ కేటాయించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ను పరిశ్రమలు, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు కలసి అభినందించారు. పరిశ్రమల శాఖ పనితీరుపై మంత్రి ఆరా తీయడంతో పాటు ఆయా విభాగాల్లో సమస్యలు తెలుసుకున్నారు. చేనేత, వస్త్ర పరిశ్రమల విభాగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. దేశంలో వివిధ విభాగాల్లో నెలకొన్న అత్యున్నత విధానాలను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆ దిశగా అధికారులు అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మైనింగ్ అక్రమాలను అరికట్టడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రజలకు కూడా మేలు జరుగుతుందన్నారు. తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులను ఆదుకొనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. గురువారం పరిశ్రమలతో పాటు, చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగంపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని కేటీఆర్ చెప్పారు. మంత్రిని కలసిన వారిలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం డైరక్టర్ ప్రీతీమీనా, ఆప్కో ఎండీ శైలజారామయ్యర్, టీఎస్ఎండీసీ డైరక్టర్ ఇలంబర్తి, టీఎస్ఐఐసీ ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి ఉన్నారు.