త్వరలో ఖరీఫ్ రుణాలు
- రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ఎజెండా
- నాయకుల్లా కాదు.. సేవకుల్లా పనిచేస్తాం
- మంత్రి హరీష్‌రావు వెల్లడి
మెదక్: త్వరలో బ్యాంకుల ద్వారా రైతులకు ఖరీఫ్ రుణాలు ఇప్పిస్తామని, ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు ప్రకటించారు. గురువారం ఘనపురం కాల్వల ఆధునికీకరణ పనులను ప్రారంభించిన అనంతరం మెదక్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రూ.18వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నామని, దీంతో 35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
మరోవైపు ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైనందున త్వరలో కొత్త రుణాలు ఇప్పిస్తామన్నారు. గతంలో కేవలం రూ.3,318 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేశారన్నారు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా సీఎం చంద్రబాబులాగా ఎలాంటి కమిటీలు వేయకుండానే రుణమాఫీని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుల శ్రేయస్సే తమ ఎజెండా అన్నారు. సాగునీటి రంగంలో జిల్లాకు పెద్ద పీట వేస్తామన్నారు.
తెలంగాణలో వలసలు, రైతు ఆత్మహత్యలు అధికంగా చోటు చేసుకుంటున్నందునా ప్రాజెక్టులు నిర్మించి ప్రతి నీటిబొట్టును ఒడిసి పడతామని చెప్పారు. జైకా నిధులతో ఘనపురం కాల్వల ఆధునికీకరణ పనులు త్వరలో పూర్తి చేయిస్తామన్నారు. ప్రతి వారం పనుల అభివృద్ధిపై అధికారులతో రివ్యూ నిర్వహిస్తామన్నారు. గొలుసు చెరువులను పునరుద్ధరించి జలవనరులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మెదక్ మార్కెట్ యార్డ్‌లో సీసీ రోడ్లు, రైతుల విశ్రాంతి గృహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వ్యాపారులు సహకరిస్తే షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తామన్నారు. నియోజకవర్గంలో ఐదు ఐకేపీ సెంటర్లకు రూ.1.25కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. మంజీర నది వెంట పాదయాత్ర చేసి జలవనరుల వినియోగానికి అవసరమైన ప్రాజెక్టులను రూపొందిస్తామన్నారు. పాపన్నపేటలో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన మెదక్ ప్రాంతంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
గుండువాగు ప్రాజెక్టును పూర్తిచేయాలని, హల్దివాగుపై చెక్‌డ్యాం నిర్మించాలని, బొల్లారం మత్తడి నుంచి కోంటూర్ చెరువుకు ఎత్తిపోతలు చేపట్టాలన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ మంజీర నీరు జిల్లాకు అందేలా చూడాలన్నారు. ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాలు, బడిబాటను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.
అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ మెదక్ మార్కెట్ కమిటీలోని ఉల్లి గోదాములను ఆధునికీకరించాలని, రైతుల విశ్రాంతి భవనాన్ని, షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ వనజాదేవి పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఇరిగేషన్ సీఈ మధుసూదన్, జపాన్ దేశపు, జైకా ప్రతినిధి కామియ, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌గౌడ్, ఏ.కృష్ణారెడ్డి, రాగి అశోక్, జీవన్‌రావు, మాజీ మంత్రి కుమారుడు కరణం సోమశేఖర్, మాజీ ఎంపీపీ పద్మారావు, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు గంగాధర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాలాగౌడ్, విద్యావేత్త సుభాష్ చందర్‌గౌడ్, ఎంపీటీసీ గురుమూర్తిగౌడ్, టి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.