భూసేకరణ బూచి చూపితే భయపడం
- అసలు చట్టమైతే కదా...సేకరణ
- ప్రజలకు న్యాయం చేసి ముందుకెళ్లండి: ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ఈ నెల 20 నుంచి భూసేకరణ చేస్తామని రాష్ట్రమంత్రి పి.నారాయణ ప్రకటించడం రైతులను భయపెట్టడం, మోసగించడమేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని పార్లమెంటు ఉభయసభల్లో గట్టెక్కించలేక మార్పులు, చేర్పులపై పునరాలోచనలో పడిన నేపథ్యంలో నారాయణ ఇలా ప్రకటించడాన్ని ఆయన ఆక్షేపించారు.
ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ బలవంతంగా భూసేకరణ చేయలేదని స్పష్టమైందని, ఒకవేళ అంతకు తెగిస్తే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద రైతులు, కూలీలకు అండగా నిలుస్తారని ఆర్కే పేర్కొన్నారు. రైతులందరి ఆమోదంతోనే ప్రజారాజధాని రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని,అందుకు భిన్నంగా జరిగితే అలు పెరగని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
గతి తప్పిన హామీలు...
ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ జరగలేదు. పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు చెక్కులు పూర్తిగా ఇవ్వనేలేదని ఎమ్మెల్యే విమర్శించారు. దేవాదాయ భూములను నేరుగా స్వాధీనం చేసుకునే అధికారం లేనప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందని, అటవీ భూములను కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు డీనోటిఫై చేయలేదన్నారు.
లంక భూములు, అసైన్డ్ భూముల రైతులకు పరిహారం అందజేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు కాలేదన్నారు. కౌలురైతుల లెక్కింపు, వ్యవసాయ కూలీల వివరాలు నమోదు చేయకపోగా అర్హులను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన వందలమంది కూలీలు, వ్యవసాయాధారిత చేతివృత్తుల వారి గురించి అసలు పట్టించుకొనకపోగా 9.2, 9.3 ఫారాలు ఇచ్చి న్యాయస్థానం మెట్లెక్కిన రైతులను మోసగించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం... భూమి ఎక్కడ.. ఎప్పుడిస్తారో ఇప్పటివరకు స్పష్టం చేయలేదన్నారు.
కొండవీటి వాగును ఏం చేస్తారు?
రాజధాని అమరావతి దుఃఖదాయని అయిన కొండవీటి వాగును మరల్చడం, వాగు ముం పు లేకుండా చేపట్టాల్సిన ప్రణాళికలను ఇప్పటికీ ప్రభుత్వం సిద్ధం చేయలేదని ఎమ్మెల్యే ఆర్కే గుర్తుచేస్తూ... తమ సొంత లాభాల కో సం హడావు డిగా సీడ్ క్యాపిటల్ అని, మాస్టర్ ప్లాన్ అని కొత్తకొత్త పదాలతో ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. కృష్ణాతీరంలో అక్రమ కట్టడాలని ప్రకటించిన వాటిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం సక్రమ కట్టడాలుగా మార్చుకుని, వాస్తు పిచ్చితో వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.