సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు పెంపు
మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో పనిచేసే దిగువస్థాయి ఉద్యోగుల వేతనాలు పెంచాలని ‘సెర్ప్’ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఐకేపీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెర్ప్లోని ఎల్-1, ఎల్-2 కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు.
ఎల్-1 ఉద్యోగులకు రూ.1,500, ఎల్-2 ఉద్యోగులకు వెయ్యి రూపాయల చొప్పున వేతనాన్ని పెంచుతున్నట్టు వెల్లడించారు. వీరితోపాటు వీఓఏలకు రూ.రెండు వేల వేతనం చెల్లించాలని కూడా తీర్మానించినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ఆరోగ్య కార్డులను సెర్ప్ ఉద్యోగులకూ కల్పిస్తామని, వీరికి రూ.రెండు లక్షల పరిమితి ఉంటుందని మంత్రి తెలిపారు. మహిళా ఉద్యోగులను వేధిస్తే నిర్భయ చట్టం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించిందన్నారు.