మార్క్‌ఫెడ్‌కు కన్నం
ఖమ్మం వ్యవసాయం: ‘కంచే చేను మేసిన చందం’గా స్టేట్‌వేర్ హౌసింగ్ ముఖ్య అధికారి వ్యవహరించారు. కాపాడాల్సిన ఆయనే అవినీతికి యత్నించి అడ్డంగా దొరికి పోయారు. జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. కొనుగోలు చేసిన వాటిని జిల్లాకేంద్రంలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో మార్క్‌ఫెడ్ 6,251 టన్నులు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచింది. వాటిని మార్క్‌ఫెడ్ సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు అమ్మకానికి పెట్టి టెండర్లు పిలిచారు.
టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత డెలవరీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ ఆర్డర్ల ఆధారంగా మొక్కజొన్న కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు గోదాముల నుంచి వాటిని తరలిస్తున్నారు. జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది 6,251 టన్నుల సరుకు కొనుగోలు చేశారు. 6,230 టన్నుల సరుకుకు మార్క్‌ఫెడ్ సంస్థ టెండర్లు పిలిచింది.
అంటే 21 టన్నులు మినహా మొత్తం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అమ్మారు. 6,230 టన్నుల్లో 49 టన్నులు మినహా మిగిలిన మొత్తానికి మార్క్‌ఫెడ్ మేనేజర్ కాంట్రాక్టర్లకు రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారు. అయితే 49 టన్నులకుగాను గోదాముల్లో 9 టన్నులు మాత్రమే ఉన్నాయని స్టేట్‌వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ తనకు సూచించారని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత చెబుతున్నారు. మిగిలిన 40 టన్నుల విషయం అడుగగా కొరత ఏర్పడినట్లు సమాధానం ఇచ్చారన్నారు.
అక్రమానికి ఆజ్యం ఇలా...
రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆదివారం 550 మొక్కజొన్నల బస్తాలలోడుతో లారీ బయలుదేరింది. ఆ లారీ ప్రకాశ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు గోదాం వద్దకు చేరింది. అక్కడ దిగుమతి అయ్యే సమయంలో వ్యవహారం బయటపడింది. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి అక్కడ అన్లోడ్ చేయవద్దని హమాలీలకు సూచించారు. అక్కడ నుంచి లారీని తరలించారు.
లారీ కాల్వొడ్డులోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల ప్రాంతానికి చేరింది. ఈ సమాచారం జిల్లా కలెక్టర్ ఇలంబరితికి తెలిసింది. ఆయన రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హుటాహుటిన అక్కడికి వెళ్లి లారీని పట్టుకున్నారు. అదో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఏపీ20 ఎక్స్-6336 నంబర్ లారీగా గుర్తించారు. ఈ లారీలో ఉన్న మొక్కజొన్నల విలువ సుమారు రూ.3 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వేర్‌హౌసింగ్ అధికారే సూత్రధారి..
మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నలకు రక్షణ కల్పించి తిరిగి ఆ సంస్థకు అప్పగించాల్సిన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారే అక్రమార్గం పట్టించారు. నిల్వ ఉంచిన స్టాక్‌లో సుమారు 40 టన్నులను కొరత పేరుతో లెక్కల్లో చూపించలేదు. వాటిని బయటి వ్యాపారులకు విక్రయించి లక్షల రూపాయలు వెనుకేసుకుందామన్న ఆ అధికారి యత్నం బెడిసికొట్టింది. ఆదివారం సెలవురోజు అని..ఇదే అనుకూల సమయమని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ వ్యవహారంపై సీరియస్ ఉన్న కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనితో సంబంధమున్న స్టేట్‌వేర్ హౌసింగ్ అధికారుల్లో వణుకుపుడుతోంది. మార్క్‌ఫెడ్ అధికారులు తమకేమి సంబంధం లేదని చేతులెత్తేశారు.