తైక్వాండో సమరం
-తాడేపల్లిగూడెంలో రాష్ట్రస్థాయి టోర్నమెంట్
-నేటి నుంచి పోటీలు
తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో చాంపియన్షిప్-2016 పోటీలు గురువారం సాయంత్రం స్థానిక డీఆర్ గోయంకా మహిళా కళాశాలలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 13 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు తరలివచ్చారు.
సబ్ జూనియర్ (అండర్-12), క్యాడెట్ (అండర్-14), జూనియర్ (అండర్-17), సీనియర్ (17+) విభాగాల్లో, బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం అధికారికంగా పోటీలు ప్రారంభమవుతాయి. తొలిరోజు పూమ్సే (విన్యాసాలు), రెండో రోజు కురోగి (యుద్ధ విన్యాసాలు) విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ఏఆర్కే వర్మ, కైండ్ నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు విలేకరులకు తెలిపారు. ప్రధాన రిఫరీగా అసోసియేషన్ కార్యదర్శి గుణ్ణం కృష్ణమోహన్ వ్యవహరిస్తారు. ప్రతి కోర్టుకు ముగ్గురు కార్నర్ రిఫరీలు, ఒకరు సెంట్రల్ రిఫరీ ఉంటారని వివరించారు.