దుష్టదహనం
అతడు అమిత బల పరాక్రమాలు, అపారమైన సైనిక సంపద కలిగినవాడు. అందరికీ ఒక తల మాత్రమే ఉంటే అతడికి పది తల లున్నాయి. ఆ తలల్లో ఉన్నది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు సహా పర స్త్రీ వ్యామోహం, పరధారాపహరణం, దర్పం, అతిశయం, అహంకారం అనే పది దుర్గుణాలు. వాటిని విద్య, వినయం, విజ్ఞానం, వివేకం, విచక్షణ, సమయస్ఫూర్తి, సమయపాలన, న్యాయం, ధర్మం, తర్కం అనే పది సుగుణాలు కలిగిన సామాన్యమానవుడు జయించాడు. చెడు మీద మంచి విజయం సాధించడమే రామలీల. ఈ దసరా రోజు మనలోనిఆ పది దుర్గుణాలనూ దహనం చేద్దాం. అధర్మంపై విజయం సాధిద్దాం.
దసరారోజు దేవీపూజలు చేయడం సర్వసాధారణం. అయితే భారతదేశంలోనూ, ఇతర దేశాలలోనూ కూడా రామలీలా మహోత్సవాలు కూడా చేస్తారు. జగజ్జననిని పూజించే ఈ కాలంలో రామలీలా మహోత్సవాలెందుకు చేస్తారని ప్రశ్న. అదెందుకో తెలుసుకుందాం. విజయదశమి అనేది అమ్మవారు మహిషుడిపై విజయం సాధించినందుకు చిహ్నంగా జరుపుకుంటున్న విజయోత్సవ వేడుకలే కాదు... రాముడు రావణునిపై విజయ దుంధుభులు మోగించిన రోజు కూడా! అందుకే విజయదశమినాడు రామ్లీలోత్సవాలు జరుపుకోవడం కనిపిస్తుంది. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. రామరావణ యుద్ధం జరిగిన తీరుతెన్నులు చూద్దాం.
శ్రావణమాసంలో అమావాస్యనాడు రామరావణ యుద్ధం మొదలైంది. ఆ సంకుల సమరంలో చాలామంది రాక్షసులు మరణించారు. మిగిలిన వాళ్లు భయపడి పారిపోయి బతుకుజీవుడా అంటూ లంకలో ప్రవేశించారు.
పాడ్యమితో పునఃప్రారంభం
భాద్రపద శుద్ధ పాడ్యమినాడు మరల యుద్ధం మొదలయింది. ఆ రాత్రి ఇంద్రజిత్తు నాగపాశాలతో రామలక్ష్మణులను బంధించాడు. విదియనాడు గరుత్మంతుడు వచ్చి నాగపాశాలనుండి విడిపించాడు. ఆరోజే ధూమ్రాక్ష సంహారం జరిగింది. తదియనాడు వజ్రదంష్ర్టుని వధ, చవితినాడు అకంపన సంహారం జరిగాయి. పంచమినాడు ప్రహస్తుడు మరణించాడు. షష్ఠినాడు రావణుని కిరీటం భగ్నమయింది. సప్తమినాడు కుంభకర్ణుని మేల్కొలిపారు. భాద్రపద కృష్ణ పాడ్యమినాడు అతికాయుడు మరణించాడు.
విదియనాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆరోజే హనుమ ఔషధ పర్వతం తెచ్చి వానరులను పునరుజ్జీవింపజేశాడు. తదియనాడు కుంభకర్ణ వధ జరిగింది. చవితినాడు మకరాక్షసుని సంహరించాడు శ్రీరాముడు. నవమినాడు మాయాసీతను వధించాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తుతో మూడురోజులు యుద్ధం జరిగింది. త్రయోదశినాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. చతుర్దశినాడు రావణుడు మూలబలం పంపితే శ్రీరాముడు దానిని సంహరించాడు.
నవమి వరకు హోరాహోరీ
అమావాస్యనాడు రావణుడు యుద్ధానికి బయలుదేరాడు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమినాడు రావణుడు విభీషణునిపై శక్తిని ప్రయోగిస్తే, లక్ష్మణుడు అతనికి అడ్డం వెళ్లి దెబ్బతిని మూర్ఛపోయాడు. మళ్లీ ఓషధులతో లక్ష్మణునికి స్పృహ వచ్చింది. ఆరోజు దేవేంద్రుడు మాతలి సహా తన రథాన్ని శ్రీరామునికి పంపాడు. విదియనాడు రాముడి దెబ్బలకు భయపడి రావణుడు లంకలోనికి పారిపోయాడు.
తదియనాడు మరల వచ్చిన రావణుడు హోరాహోరీ నవమివరకు పోరాడాడు. ఆరోజే శ్రీరాముని చేతిలో రావణాసురుడు మరణించాడు. విజయదశమినాడు దేవతలు శ్రీరాముని స్తుతించారు. రావణవధ అన్నిలోకాలకు ఆనందం కలిగించింది.
దశమి దాకా... దివ్యచరితం
ఈ యుద్ధ క్రమాన్ని గమనిస్తే ప్రధానంగా రామరావణుల యుద్ధం శరన్నవరాత్రుల కాలంలో జరిగిందని స్పష్టమవుతోంది. రావణుని వధకు ఆనందసూచకంగా ఈ పదిరోజులూ శ్రీరాముని దివ్యచరిత్రను దృశ్యరూపకంగా సంగీతయుక్తంగా ప్రదర్శిస్తుంటారు. అదే రామలీల. సంస్కృత పండితులు శ్రీరామచరిత్ర తెలియడానికి శ్రీమద్రామాయణం చదువుకుంటారు. భాషాపండితులు తమ తమ భాషలలో రామాయణాన్ని చదువుకుని ఆనందిస్తుంటారు.
అన్ని భారతీయ భాషలలో రామకథ ఉంది. చదివినదానికంటే కంటితో చూస్తే అధికానందం కలుగుతుంది. దానికోసం దృశ్యశ్రవణ రూపకంగా శ్రీరామకథపై అనేక నాటకాలు వెలిశాయి. కాని ఆ నాట కాలు కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. సాధారణ ప్రజానీకానికి రామకథ రుచి చూడడానికి సాధనం ఏదో కావాలి. అది ఏది?
ప్రతిమ దహనం... పట్టాభిషేకం
రామకథా సంబంధమయిన ప్రదర్శనలు చేయడం, రామకథకు చెందిన పాటలు పాడడం, రావణ ప్రతిమను దహనం చేయడం ఇలాంటి కార్యక్రమాలతో రామలీల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిలో జనులనేకులు పాల్గొంటారు. నాయకులు బాణం వేసి రావణ ప్రతిమను దహనం చేయడం కూడా జరుగుతుంది. కుంభకర్ణుని ప్రతిమ, మేఘనాథుని ప్రతిమ కూడా కొందరు దహనం చేస్తారు. శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తారు. ఢిల్లీలో శ్రీరామలీల మహోత్సవాన్ని నిర్వహించడానికి ఒక పెద్ద మైదానం ఉంది. దానిని రామలీలా మైదానం అని పిలుస్తారు. నాసిక్, కాన్పూర్, చండీఘడ్, వారణాసి మొదలయిన చోట్ల రామ్లీలా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో చాలాచోట్ల బాణాసంచా అమర్చిన రావణ ప్రతిమను దహనం చేసి జనం ఆనందిస్తుంటారు.
నారాయణుడే.. రామచంద్రుడు
శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడు. ధర్మమూర్తి. నారాయణుడే రాముడిగా పుట్టి, మనిషిగా పడే కష్టసుఖాలను అనుభవించినవాడు. రామ చరిత్ర వల్ల జనులకు మంచి నడత అలవడుతుంది.
ఏ కాలంలో అయినా, ఏ రోజుల్లో అయినా, ఎక్కడైనా ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. ధర్మాన్ని నిలబెట్టేవాడు ఎంత చిన్నవాడైనా, ఎంత సామాన్యస్థితిలో ఉన్నా, అధర్మానికి పాల్పడేవాడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత బలవంతుడైనా, ఎంతటి మందీమార్బలం కలిగినవాడైనా చివరకు ధర్మం చేతిలో ఓడిపోవలసిందే! అందుకు ఉదాహరణ రామరావణ యుద్ధంలో రాముడు సాధించిన విజయమే.
అంతిమ విజయం ధర్మానిదే
రాముడు మానవమాత్రుడు. కాషాయవస్త్రాలు కట్టుకొని ఉన్నాడు. వెంట పరివారం ఏమీలేదు. కోతులే ఆయనకు తోడు. రావణుడు అపారమైన బలసంపన్నుడు. చతురంగ బలాలు కలిగినవాడు. అమిత బలపరాక్రమవంతులైన పుత్రులు, సోదరులు ఉన్నవాడు. రాముడికంటే ఎక్కువ విద్యలు అభ్యసించినవాడు. మహా శివభక్తుడు. అయితేనేం, పరాయి వారి భార్యను అపహరించడమనే అధర్మాన్ని చేసి ఉన్నాడు కాబట్టి ధర్మపరాయణుడైన రామచంద్రుడి చేతిలో ఓడిపోక తప్పలేదు. ధర్మాన్ని ఆశ్రయించినవారు ఎంత బలహీనులైనా, ఎంతటి సామాన్యులైనా చివరకు విజయం వారినే వరిస్తుందన్నమాట. అలనాటి రామరావణ యుద్ధాన్ని కళ్లకు కడుతూ, రావణ కుంభకర్ణ, మేఘనాథులను రామలక్ష్మణులు వధిస్తున్న దృశ్యం ధర్మవిజయాన్ని గురించి నొక్కి చెబుతుంది.
- డా. సి. శివరామకృష్ణ శర్మ, ఆర్.ఎ.ఎస్. శాస్త్రి