పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వండి
కేజ్రీవాల్ డిమాండ్
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, వెంకయ్యలతో వరుస భేటీలు
ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: సునామీ విజయాన్ని మూటగట్టుకున్న 24 గంటల్లోనే ‘ఆమ్ ఆద్మీ’ పనిలోకి దిగిపోయారు. ప్రమాణం చేయటానికి ఇంకా మూడు రోజుల సమయం ఉన్నా.. అరవింద్ కేజ్రీవాల్ తన పని మొదలుపెట్టారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆయన, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాతో కలసి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులతో భేటీ అయ్యారు.
తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఇద్దరినీ కోరారు. రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో బుధవారం మధ్యాహ్నం కేజ్రీవాల్ కలిశారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 2013 మేనిఫెస్టోలో బీజేపీ కూడా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తామని పేర్కొందని, ఇప్పుడు కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో, ఢిల్లీలో తమ పార్టీ పగ్గాలు చేపట్టనున్నందున ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వటం కష్టం కాదని సమావేశం అనంతరం మనీష్ సిసోడియా అన్నారు.
కేంద్రం జోక్యం తప్పనిసరి అయిన అంశాల్లో సమస్యల సత్వర పరిష్కారం గురించి కూడా రాజ్‌నాథ్‌తో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్రం నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్లు సిసోడియా అన్నారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన శాఖల మంత్రులు వెంకయ్యనాయుడుజీ, రాజ్నాథ్జీలను కలిశా.. 14న జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించా’’ అని సమావేశానంతరం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రభుత్వం తనకు కేటాయించిన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కేజ్రీవాల్ తిరస్కరించారు.
స్కూళ్లకు, ఆసుపత్రులకు భూమి ఇవ్వండి
రాజ్‌నాథ్‌ను కలవటానికి ముందు అరవింద్ కేజ్రీవాల్, సిసోడియాలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడితో నిర్మాణ్ భవన్లో సమావేశమయ్యారు. ఢిల్లీలోని అనధికార కాలనీలను వేగంగా క్రమబద్ధీకరించడానికి, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సహకారం అందించవలసిందిగా మంత్రిని కోరినట్లు మనిష్ సిసోడియా చెప్పారు. ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, పార్కులు పార్కింగ్లాట్లకు స్థలం కావలసి ఉందని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీల దగ్గర ఉన్న స్థలాలను సేకరించే విషయంలో కేంద్రం సహ కారాన్ని కోరామని సిసోడియా తెలిపారు. ఢిల్లీ అభివద్ధి కోసం అప్ సర్కారుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని వెంకయ్యనాయుడు వారికి చెప్పారు.
రాష్ట్రపతిని కలిసిన కేజ్రీవాల్..
బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేజ్రీవాల్ మర్యాదపూర్వకంగా కలి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా రాష్ట్రపతి కేజ్రీవాల్‌కు రెండు పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. ఒకటి భారత రాజ్యాంగ ప్రతి కాగా, రెండవది తాను రాసిన ‘థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ అని మనిష్ సిసోడియా తెలిపారు. కాగా,అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆయన ఆహ్వానిస్తారు.
కోర్టు హాజరు నుంచి మినహాయింపు
ఓ పరువునష్టం దావా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు మినహాయింపునిచ్చింది. కేంద్రమంత్రులతో అపాయింట్మెంట్ ఉన్నందున హాజరు నుంచి మినహాయించాలంటూ కేజ్రీవాల్ కోరటంతో కోర్టు మన్నించింది.
కేజ్రీవాల్ ప్రమాణానికి భారీ ఏర్పాట్లు
ఏడాది క్రితం సరిగ్గా రాజీనామా చేసిన రోజునే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేయబోతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జాతీయ పార్టీలను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ప్రజాపనుల శాఖ వేదిక ఏర్పాట్లలో తలమునకలైపోయాయి. దాదాపు 60 వేల మంది కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వీక్షిసారని అంచనా. కాగా, కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరుకావటం లేదంటూ అవినీతి వ్యతిరేక ప్రచార కర్త అన్నాహజారే బుధవారం పూణెలో తెలిపారు.