మత్తు మందు చల్లి.. మహిళ కిడ్నాప్
వరంగల్‌లో ఎత్తుకెళ్లి.. ఘన్‌పూర్‌లో వదిలేసిన దుండగులు
నాలుగు తులాల బంగారు గొలుసు అపహరణ
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : మహిళ ముఖంపై మత్తు మందు ఉన్న ఖర్చీఫ్ పెట్టి.. ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తు లు అపహరించిన సంఘటన వరంగల్ బస్‌స్టేషన్‌లో శుక్రవారం జరిగింది. బాధిత మహిళ కథనం ప్రకా రం.. కొడకండ్ల మండలం గంట్లకుంటకు చెందిన జూలూరి దివ్య, గణేష్ దంపతులు సొంత పనుల నిమిత్తం శుక్రవారం వరంగల్ వెళ్లారు. తొర్రూరులో ఫంక్షన్‌కు వెళ్లేందుకు వరంగల్ ఎంజీఎం వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు వరంగల్ బస్టాండ్‌లోకి చేరుకున్న తర్వాత టాయిలెట్‌కు వెళ్లేందుకు దివ్య బస్టాండ్‌లోని మూత్రశాలల వైపు వెళ్లింది. అయితే అక్కడ ముసుగు ధరించి ఉన్న మహిళ తన ముఖంపై మత్తు మందు ఉన్న ఖర్చీఫ్‌ను పెట్టిందని, తర్వాత తనకు స్పృహ లేదని, తీరా కళ్లు తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నానని చెప్పింది. ఇక్కడి వారిని ఏఊరని అడిగితే స్టేషన్‌ఘన్‌పూర్‌లో బుడిగజంగాల కాలనీ సమీపాన ఉన్నట్లు తెలిసిందన్నారు.
తన మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, పుస్తెలు, గుండ్లు మొత్తం నాలుగు తులాల బంగారాన్ని అపహరించారని ఆమె రోదిస్తూ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె భర్త గణేష్ మాట్లాడుతూ తన భార్య ఎంతకూ రాకపోవడంతో మూత్రశాల వైపు వెళ్లి వెతికానని, జాడ తెలియకపోవడంతో ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదన్నారు. గంట తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసిందని, అప్పటికే ఆమె ఘన్‌పూర్‌లో ఉన్నట్లు తెలిసిందన్నారు. మత్తు నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ఆమెకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం బాధిత దంపతులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే వరంగల్ బస్‌స్టేషన్‌లో తనను కిడ్నాప్ చేశారని బాధితురాలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.