బీఎండబ్ల్యూ సంస్థ ఎండీ స్టెఫాన్ ష్లిఫ్ అరెస్టు
బీఎండబ్ల్యూ సంస్థ ఎండీ ఒకరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బీఎండబ్ల్యు ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎండీగా పనిచేస్తున్న డేవిడ్ స్టెఫాన్ ష్లిఫ్ తమను మోసం చేశారంటూ 2010లో దాఖలైన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో ఆయన్ను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీసీసీ ఆర్. జయలక్ష్మి తెలిపారు. మోసం, కుట్ర ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఆయనను కోర్టులో హాజరుపరచగా, జడ్జి 11 రోజుల రిమాండ్ విధించారు. కాగా, స్టెఫాన్ విదేశీయుడు కనుక ఆయన అరెస్టు విషయాన్ని పోలీసులు జర్మనీ ఎంబసీ కార్యాలయానికి తెలిపారు. పోలీసులు ష్లిఫ్ను గుర్గావ్లో అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. అయితే, తమ సంస్థ ఉన్నతోద్యోగి అరెస్టును బీఎండబ్ల్యు గ్రూపు ఖండించింది. తమవాళ్లు ఎలాంటి తప్పులు చేయరని, దీనిపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.
2007 జూన్ నుంచి 2009 డిసెంబర్ వరకు బీఎండబ్ల్యుకు డీలర్లుగా వ్యవహరించిన డెల్టా కార్స్ సంస్థ ఈ ఫిర్యాదు దాఖలుచేసింది. తమకు ఉన్న డిమాండు కంటే అధికంగా కార్లు సరఫరా చేయడం వల్ల వడ్డీల భారం ఎక్కువై తాము నష్టాలపాలయ్యామని ఆ సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది.