భూగ్రహాల అన్వేషణకు ధూళి మేఘాల అవరోధం!
మన సమీపంలోని ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమిలాంటి గ్రహంపై వాతావరణం, అతిప్రకాశమంతమైన నక్షత్రకాంతి, ఆకాశంలో ధూళిమేఘాలను చూపుతూ రూపొందించిన ఈ ఊహాచిత్రాన్ని సోమవారం యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ పరిశోధకులు విడుదలచేశారు. మన భూమి మాదిరిగా జీవుల మనుగడకు అనుకూలమైన గ్రహాల అన్వేషణ కోసం.. వెరీ లార్జ్ టెలిస్కోపుతో అనేక నక్షత్రాలపై అధ్యయనం చేసిన వీరు తొమ్మిది నక్షత్రాల చుట్టూ భారీ ధూళిమేఘాలను కనుగొన్నారు.
నక్షత్రాలకు మరీ దూరంగా, దగ్గరగా లేకుండా అనుకూలమైన దూరంలో ఉన్న గ్రహాల ప్రాంతంలోనే ఈ ధూళిమేఘాలు ఏర్పడటం వల్ల భూమిలాంటి గ్రహాల అన్వేషణకు తీవ్ర అవరోధం కలుగుతోందట. గ్రహశకలాలు ఢీకొట్టుకోవడం, తోకచుక్కలు క్షయం అవడం వల్ల అంతరిక్షంలోకి పెద్ద ఎత్తున ధూళికణాలు విడుదలై ఇలా మేఘాలుగా ఏర్పడి నక్షత్రకాంతితో ప్రతిఫలిస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.