హ్యాట్సాఫ్.. స్టేట్‌హోం
నేడు అనాథ మహిళకు వివాహం
వెంగళరావునగర్: అ అమ్మాయి ఒక అనాథ.. నగరంలోని మహిళా శిశుసంక్షేమశాఖ ప్రాంగణంలోని అనాధ ఆశ్రమానికి (స్టేట్‌హోం)లో చేరింది. ఐదేళ్ళపాటు స్టేట్‌హోంలోనే గడిపింది.. గత ఏడాది మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు ఆమెకు స్టేట్‌హోం ప్రాంగణంలో ఉన్న శిశువిహార్‌లో కేర్ టేకర్‌గా (కాంట్రాక్ట్ బేసిక్‌మీద) ఉద్యోగం ఇచ్చారు. అంతేగాకుండా ప్రస్తుతం ఆమెకు పెళ్ళి కూడా చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
డిసెంబరులో నిశ్చితార్థం, రేపు పెళ్ళి...
తల్లిదండ్రులను కోల్పోయి స్టేట్‌హోంలో చిరుద్యోగం చేస్తున్న అనాధ యువతికి గత ఏడాది డిసెంబరు 17నస్టేట్హోం అధికారులు నిశ్చితార్థం జరిపించారు. ఈనెల 26న వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. వివరాలు.. ఒంగోలు ప్రాంతానికి చెందిన నాగలక్ష్మికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతిచెందారు. తోడబుట్టిన అక్కకూడా మృతిచెందింది, సోదరుడు మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. దాంతో నాగలక్ష్మి బంధువులు 2008లో నగరానికి తీసుకువచ్చి వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు అదే ప్రాంగణంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ చిరుద్యోగిగా చేస్తూ జీవిస్తుంది. మూడు నెలల కిందట గుడి మల్కాపూర్‌లో నివాసం ఉండే ప్రతాప్ తాను ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు తెలియజేశాడు. అతని నిర్ణయాన్ని వారు స్వాగతిస్తూస్థానిక యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయానికి వచ్చారు.
అధికారులు ప్రతాప్ కుటుంబ పరిస్థితిని, పూర్తి వివరాలను సేకరించి అతనికి తమ వద్ద కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మి వివరాలను తెలియజేశారు. అనంతరం అమ్మాయిని, అబ్బాయిని తమ ఇష్టాయిష్టాలను తెలుసుకుని వివాహం చేయడానికి నిర్ణయించారు. ఒకరికొకరు నచ్చడంతో గత ఏడాది డిసెంబరు 17న ఉన్నతాధికారుల సమక్షంలో ఇరువురికి నిశ్చితార్థం జరిపించారు. కాగా ఇరువురి వివాహం ఈనెల 26వ తేదీనాడు మద్యాహ్నం 12.36 గంటలకు స్టేట్‌హోంలోనే జరుపనున్నట్టు అధికారులు తెలియజేశారు.