ఉరేసుకొని చనిపోయిన టీవీ నటి
లాస్ ఏంజిల్స్: ప్రముఖ టీవీ నటి, యూట్యూబ్ స్టార్ స్టివీ ర్యాన్ ఆత్మహత్య చేసుకుంది. తన నివాసంలో ఉరి వేసుకొని ఆమె చనిపోయినట్టు తాజాగా పోలీసులు నిర్ధారించారు. 33 ఏళ్ల ర్యాన్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా బాగా పాపులర్ అయింది. వీహెచ్1 కామెడీ సిరీస్ 'స్టివీ టీవీ'తో పేరుప్రఖ్యాతలు సాధించింది. శనివారం తన నివాసంలో విగతజీవిగా ఆమె కనిపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆమెది ఆత్మహత్యేనని నిర్ధారించారు.
మొదట 'లిటిల్ లోకా' యూట్యూబ్ సిరీస్‌తో ర్యాన్ తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు సెలబ్రిటీ పేరడీలు నిర్వహించడం ద్వారా స్టార్‌గా ఎదిగింది. ఇటీవల తన తాతయ్య చనిపోయిన తర్వాత తాను మానసికంగా చాలా క్షోభకు గురవుతున్నట్టు ఆమె తెలిపింది. ర్యాన్ కన్నుమూతపై ఆమె మాజీ ప్రియుడు, నటుడు డ్రాకే బెల్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. 'నో.. నో.. నో..! దీనిని నేను నమ్మలేను. ఈ పీడకల నుంచి ర్యాన్ నన్ను మేల్కొలుపు. నేన్ను నేను ప్రేమించాను. నిన్నెప్పుడు నేను మిస్ అవుతూ ఉంటాను' అని డ్రాకే ట్వీట్ చేశాడు. 2006లో ఎంటీవీ అవార్డుల సందర్భంగా తాము ఇరువురు దిగిన ఫొటోను పోస్టు చేశాడు.