కొంగొత్త ఆవిష్కరణలు
‘స్టార్టప్ ఇండియా’ దిశగా విద్యార్థుల సమాయత్తం
పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం
ఫిబ్రవరి 28 వరకు నామినేషన్ల స్వీకరణ
గీసుకొండ ప్రధాని నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు ’స్థార్టప్ ఇండియా’ దిశగా సమాయత్తం చేసేందుకు.. పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాలు, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనల వైపు విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనాక్’ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇప్పటి వరకు ‘ఇన్స్పైర్’ పేరిట కొనసాగుతున్న కార్యక్రమంలో కొన్ని మార్పులు చేసి దీనిని రూపొందించింది.
రూ.5వేల చొప్పున..
దేశవ్యాప్తంగా ఐదు లక్షల పాఠశాలల్లో ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనాక్’ కార్యక్రమాన్ని చేపడుతుండగా తద్వారా పది లక్షల ఆవిష్కరణలు చేయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలా ఎంపికైన లక్ష ప్రాజెక్టుల నుంచి కొన్నింటిని ఎంపిక చేసి వాటిని రూపొందించిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున ఖర్చుల కింద ఇస్తారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి 10 నుంచి 15 ఏళ్ల వయస్సు.. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల విద్యార్థులు అర్హులు. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆసక్తి గల విద్యార్థుల తమ పేర్లు, ప్రాజెక్టు వివరాలను ’డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్–జీఎస్టీ.జీఓవీ.ఇన్’ ద్వారా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి..
ఇప్పటి వరకు వన్‌టైం(ఓటీఆర్) రిజిస్ట్రేషన్ కాని యుపీఎస్, హైస్కూళ్ల హెచ్ఎంలు వెంటనే చేయించుకుని జిల్లా అధికారులకు సమాచారం చేరవేయాలని వరంగల్ రూరల్ జిల్లా విద్యాశాధికారి నారాయణరెడ్డి సూచించారు. ఓటీఆర్ చేసిన 48 గంటల లోపు రిజిస్టర్ చేసిన ఈ మెయిల్ ఐడీకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుందని, వీటి ద్వారా వెబ్సైట్లోకి లాగిన్ అయి విద్యార్థుల నామినేషన్లు అప్లోడ్ చేయాలని తెలిపారు. ’ఇన్స్పైర్ అవార్డ్స్–మనాక్’కు సంబంధించి సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి కె.శ్రీనివాస్(98488 78455), సైన్స్ టీచర్ పి.ఆనంద్(99480 99462)ను సంప్రదించాలని సూచించారు.