రుణాల రికవరీలో గోల్మాల్
బోధన్ రూరల్ : స్త్రీనిధి రుణాల రికవరీలో చేతివాటం ప్రదర్శించిందో ఐకేపీ కమ్యూనిటీ యాక్టివిస్ట్(సీఏ). వసూలు చేసిన సొమ్ములో రూ. 3.12 లక్షలను కాజేసింది. ఐకేపీ అధికారుల విచారణలో ఈ విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. హున్సా గ్రామంలో 37 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 27 మహిళా సంఘాలకు 2012 నుంచి రుణాలు మంజూరు చేస్తున్నారు. స్త్రీనిధి ద్వారా సుమారు రూ. 45 లక్షలకుపైగా రుణాలను అందించారు. ఈ సంఘాలకు సీఏగా సునీత పనిచేస్తోంది. ఆమె రుణాలను రికవరీ చేసి బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఆమె చేతివాటాన్ని ప్రదర్శించింది. నకిలీ బిల్లు బుక్కులను సృష్టించి.. రికవరీ చేసిన సొమ్మున కాజేసింది.
వెలుగు చూసిందిలా..
గ్రామానికి చెందిన యోగేశ్వర మహిళా సంఘం సభ్యురాలు శోభ భర్త ఇటీవల బ్యాంకు పాస్‌బుక్కులను పరిశీలించాడు. రుణం సక్రమంగా చెల్లిస్తున్నా.. తీసుకున్న రుణం మొత్తం తగ్గకపోవడంతో గత నెల 27వ తేదీన ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం) సూదం వెంకటేశంను కలిసి ఫిర్యాదు చేశాడు. ఆయన ఈ విషయమై విచారణ జరిపారు. 23 మహిళా సంఘాలకు సంబంధించి 3,16,412 రూపాయలు గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. గురువారం స్త్రీనిధి ఏజీఎం శ్రీనివాస్, మేనేజర్ సతీశ్ పట్టణంలోని స్త్రీనిధి కార్యాలయం, హున్సా గ్రామాలలో విచారణ జరిపారు. సొమ్మును సీఏనుంచి రికవరీ చేసి, సంబంధిత మహిళా సంఘాల సభ్యులకు అందించారు. అవకతవకలకు పాల్పడిన సీఏ సునీతను విధుల నుంచి తొలగించారు.
కాగా రుణాలు మంజూరు చేయించడంలోనూ అవకతవకలు జరిగి ఉంటాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలోనూ విచారణ జరపాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.
నివేదికను ఐకేపీ పీడీకి అందిస్తాం
హున్సా గ్రామంలో స్త్రీనిధి రుణాల రికవరీలో అవకతవకలు జరిగాయి. ఈ విషయమై విచారణ జరిపాం. సీఏ సునీత రుణాల రికవరీలో అవకతవకలకు పాల్పడి, రూ. 3,16,412 కాజేసినట్లు గుర్తించాం. ఆమెనుంచి సొమ్మును రికవరీ చేసి, విధులనుంచి తొలగించాం. విచారణ నివేదికను ఐకేపీ పీడీకి అందిస్తాం.
– శ్రీనివాస్, స్త్రీనిధి ఏజీఎం, నిజామాబాద్