కుట్లు లేకుండానే గుండె వాల్వు మార్పిడి!
గుండెల్లో వాల్వు మార్పిడి అంటే.. అందరూ ఎంతో టెన్షన్ పడతారు. కానీ, అస్సలు కుట్లే వేయకుండా వాల్వు మార్పిడి చేసి ఢిల్లీ వైద్యులు చరిత్ర సృష్టించారు. ఫిజీకి చెందిన 54 ఏళ్ల పేషెంటుకు డాక్టర్ సుశాంత్ శ్రీవాత్సవ ఈ చికిత్స చేశారు. బీఎల్కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యుల బృందం ఈ ఆపరేషన్ చేసింది. ఔట్ పేషెంటుగా వచ్చిన ఆ వ్యక్తి శ్వాస అందక బాగా ఇబ్బంది పడుతున్నారని, దాంతోపాటు గుండెనొప్పి కూడా వచ్చిందని అంటున్నారు.
అతడి ఆర్టిక్ వాల్వు బాగా సన్నబడిపోవడంతో.. గుండె నుంచి రక్తం పంపింగ్ కావడానికి బాగా ఇబ్బంది అవుతోందని పరీక్షలలో గుర్తించారు. దాంతో గుండెమీద ఒత్తిడి పెరిగింది. కుట్లు లేకుండా ఆపరేషన్ చేస్తామని ఆ పేషెంటుకు చెప్పారు. ప్రస్తుతం ఆ పేషెంటు ఐసీయూలో బాగా కోలుకుంటున్నారని, వారం రోజుల్లో తిరిగి వాళ్ల దేశానికి పంపేస్తామని వైద్యులు తెలిపారు. మొత్తం ఆపరేషన్లో కూడా ఇంప్లాంటు పెట్టేందుకు ఒక నిమిషం మాత్రమే పట్టిందని చెప్పారు. హైరిస్క్ పేషెంట్లకు ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.