నువ్వా...నేనా?
సాక్షి, చెన్నై : టీఎన్‌సీసీ అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. నువ్వా...నేనా అన్నట్టు గా ఆ పార్టీ రాష్ర్ట నాయకులు ఢిల్లీలో తిష్ట వేసి ఉన్నారు. అయితే, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, జీకే వాసన్లు ఈ పోటీకి దూరంగా ఉండడటం గమనార్హం.రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో పునరుత్తేజం కల్గించేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధమయ్యా రు. రాష్ట్రంలో ఒంటరిగా మిగిలిన పార్టీకి మున్ముందు రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదురుకాకుండా, ఇప్పుడే జాగ్రత్త లు తీసుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ తీరుతోనే డీఎంకేను దూరం చేసుకుని, రాష్ట్రంలో ఒంటరిగా మిగలాల్సి వచ్చిందన్న ఫిర్యాదులు ఏఐసీసీకి వెళ్లాయి.
ఇద్దరికీ బ్రేక్ : రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యధిక శాతం మద్దతుదారులను కలిగిన నేతలు జికే వాసన్, చిదంబరం మాత్రమే. అయితే, ప్రస్తుతం ఆ ఇద్దరి నేతల హవాకు బ్రేక్ పడి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో వీరోచితంగా శ్రమించినా, తమ వాళ్లను ఈ ఇద్దరు నేతలు గెలిపించుకోలేని పరిస్థితి. దీంతో అధిష్టానం వద్ద గుర్తింపు ఉన్న నాయకులంతా తమ కంటే, తమకు అధ్యక్ష పదవి ఇవ్వాలని మొర పెట్టుకునే పనిలో పడ్డారు. వారిలో జాతీయ పార్టీ కార్యదర్శి తిరునావుక్కరసు, కేంద్ర మాజీ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్, మాజీ ఎంపీ ఆర్ ప్రభు, మానిక్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యేలు పీటర్ అల్పోన్స్, విష్ణు ప్రసాద్, వసంతకుమార్‌లు ఉన్నారు. తక్కువ వయస్కులకు, కొత్త వాళ్లకు ఈ సారీ అధ్యక్ష పదవి కట్ట బెట్టాలన్న ఉద్దేశంతో ఏఐసీసీ అధినేత్రి సోనియా ఉన్న సమాచారంతోనే వీరంతా అధ్యక్ష పదవి మీద కన్నేయడం గమనార్హం.
మంతనాలు : అధ్యక్ష పదవి ఎంపిక మీద ఢిల్లీలో శనివారం సీనియర్ నేత ఏకే ఆంటోని నేతృత్వంలో మంతనాలు జరిగినట్టు టీఎన్‌సీసీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందులో మాజీ అధ్యక్షుడు తంగబాలు, ప్రస్తుత అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత గోపినాథ్, అధ్యక్ష పదవికి ఆశావహులైన వసంతకుమార్, మానిక్ ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శులు జయకుమార్, సెల్వకుమార్, తిరునావుక్కరసులు పాల్గొన్నట్టు చెబుతున్నారు. అయితే, జీకే వాసన్, చిదంబరం మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం గమనార్హం. చివరకు, వాసన్, చిదంబరం నేతృత్వంలో మరో మారు చర్చల అనంతరం అధ్యక్ష సీటు ఎవరికి అన్నది తేల్చే పనిలో ఆంటోని పడ్డట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాల అనంతరం, త్వరలో జరగనున్న ఏఐసీసీ కార్యవర్గం భేటీలో తీసుకునే నిర్ణయానికి అధ్యక్ష పదవి ఎంపికను వదలినట్టు మరో నేత పేర్కొనడం గమనార్హం.