నాడు హీరో ... నేడు విలన్
రాసలీలల సీడీలు చూపించి డాక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన రఘు
తాజాగా కానిస్టేబుల్ అరెస్ట్
పరారీలోనే నటి నయాన కృష్ణ అండ్ కో
బెంగళూరు : ప్రియురాలిని దక్కించుకోవాలని ప్రయత్నించి రెండు కళ్లు పోగొట్టుకుని కర్ణాటకలో హీరో అయిన రఘు అనే యువకుడు ఇప్పుడు విలన్ అయ్యాడు. రఘు అతని స్నేహితురాలు, కన్నడ నటి నయన కృష్ణ తదితరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. డాక్టర్ రాసలీలల కేసులో తాజాగా కెంపేగౌడ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మల్లేష్, ప్రైవేటు చానల్ వీడియో ఎడిటర్ హేమంత్ కుమార్, టీవీ చానల్ ట్రాన్స్పోర్ట్ విభాగం నిర్వాహకుడు సునీల్‌ను అరెస్టు చేశామని శనివారం బెంగళూరు నగర సీసీబీ పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగిన విషయం ..
మండ్యకు చెందిన రఘు అనే యువకుడు బెంగళూరు నగరానికి చెందిన యువతిని ప్రేమించాడు. 2011లో రఘు ప్రియురాలికి బెంగళూరులో వివాహం జరిగింది. వివాహం జరుగుతున్న సమయంలో రఘు కల్యాణ మంటపంలోకి వెళ్లాడు. ఆ సమయంలో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు రఘుపై దాడి చేసి రెండు కళ్లు పీకేశారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆప్పట్లో రఘు రాష్ట్రంలో హీరో అయ్యాడు. ప్రేమ కోసం రెండు కళ్లు పోగొట్టుకున్నాడని పలు స్వచ్ఛంద సంస్థలు అతనికి మద్దతు తెలిపాయి.
ప్రస్తుతం ఆ హీరో రఘు చామరాజపేటలో జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే రఘుకు ఒక వైద్యుడితో పరిచయం ఉంది. అతని బలహీనతలు రఘుకు పూర్తిగా తెలుసు. కొన్ని రోజుల క్రితం రఘు, సినీనటి నయనా కృష్ణ, కానిస్టేబుల్ మల్లేష్, హేమంత్ కుమార్, సునీల్ కలిసి ఒక పథకం వేశారు. ఒక యువతిని వైద్యుడి ఇంటికి పంపించారు.
వైద్యుడు, యువతితో రాసలీలలో ఉన్న సమయంలో సినీ నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితురాళ్లు రిహనా, మేఘనా కలిసి గుట్టు చప్పుడు కాకుండ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వైద్యుడిని బ్లాక్ మొయిల్ చేయడం ప్రారంభించారు. రూ. 25 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము మీడియా వాళ్లమని, డబ్బులు ఇవ్వకపోతే రాత్రికి రాత్రే చానళ్లలో ప్రసారం చేయిస్తామని బెదిరించారు.
డాక్టర్ వద్ద రూ. లక్ష నగదు అడ్వాన్స్ తీసుకుని మిగతా సొమ్ము వెంటనే ఇవ్వాలని అక్కడి నుంచి జారుకున్నారు. గురువారం వైద్యుడు బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కమిషనర్ ఔరాద్కర్ కేసు దర్యాప్తు చేయాలని సీసీబీ పోలీసులను ఆదేశించారు. వైద్యుడు శుక్రవారం నిందితులకు ఫోన్ చేసి తన అపార్టుమెంట్‌కు వచ్చి నగదు తీసుకోవాలని చెప్పాడు. రఘు, కానిస్టేబుల్ మల్లేష్ చాళుక్య సర్కిల్లో కారులో ఉండగా హేమంత్ కుమార్, సునీల్ వైద్యుడి ఇంటిలోకి ప్రవేశించారు.
అప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న సీసీబీ పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బయట ఉన్న రఘు, మల్లేష్ అక్కడి నుంచి జారుకున్నారు. శనివారం అమాయకుడిగా విధులకు హాజరైన మల్లేష్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘు, సినీ నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితురాళ్లు రిహనా, మేఘనాల కోసం గాలిస్తున్నామని శనివారం బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.
Follow @sakshinews