నూనెలు, పప్పుల నిల్వలపై పరిమితులు కొనసాగింపు
న్యూఢిల్లీ: కొన్ని నిత్యావసర ఉత్పత్తుల లభ్యతను మెరుగుపరచడం, ధరలను నియంత్రించడం లక్ష్యంగా కేంద్ర క్యాబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. పప్పుదినుసులు, వంటనూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులను మరో ఏడాది కాలానికి పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్రవేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కాల పరిమితి సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ విలేకరులకు ఈ విషయం తెలిపారు. ఈ నిర్ణయం స్టాక్ పరిమితులను నిర్దేశిస్తూ, అక్రమ నిల్వల సమస్యను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు దోహదపడుతుంది.
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎంకు రూ.12,350 కోట్లు...
కాగా 12వ ప్రణాళికా కాలానికి (2012-17) సంబంధించి జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)కు రూ.12,350 కోట్ల కేటాయింపుల ప్రణాళికకు పెట్టుబడుల వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. పెరుగుతున్న ఆహార డిమాండ్‌ను ఎదుర్కొనడానికి క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ఎఫ్ఎస్ఎం కింద 25 మిలియన్ టన్నులమేర ఆహార ఉత్పత్తుల వృద్ధి దీని ప్రధాన లక్ష్యం.
హెచ్‌పీసీఎల్ రాజస్తాన్ ప్రాజెక్టుకు ఓకే
కాగా రాజస్తాన్‌లో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రూ.37,229 కోట్ల రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. మరో రెండురోజుల్లో ఈ ప్రాజెక్టుకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ శంకుస్థాపన చేయాల్సి ఉంది.