భార్యను చితక్కొట్టిన ఎన్నారై భర్తకు జైలుశిక్ష
భార్యను అనుమానించి అపై చితకబాదిన కేసులో ఓ భారతీయుడికి సింగపూర్ కోర్టు 12 వారాల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రెండు వేల సింగపూర్ డాలర్ల జరిమాన విధించింది. ఇంద్రజిత్ సింగ్ బాగ్ సింగ్ (36) తన భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. ఆ క్రమంలో 2012, జులై 27న బాగ్ సింగ్ బాగా తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్యతో గొడవకు దిగాడు. భార్య ఎదురు ప్రశ్నించడంతో సింగ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
మోటరు సైకిల్ పొగ గొట్టంతో భార్యను చితకబాదాడు. దాంతో ఆమె మెడ ఎముకతోపాటు చేతి వేలు విరిగింది. దాంతో ఆమె భర్తపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాగ్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అందులోభాగంగా సింగపూర్ కోర్టు బాగ్ సింగ్‌ను నిందితుడిగా భావించి 12 వారాల జైలు శిక్షతోపాటు జరిమాన విధించింది. ఈ మేరకు ద స్ట్రైట్ టైమ్స్ శుక్రవారం వెల్లడించింది.