ట్రామా కేర్లెస్
జీజీహెచ్ క్యాజువాలిటీలో కనీస సౌకర్యాలు కరువు
అత్యవసర సేవల విభాగంలో పనిచేయని ఏసీలు
వినియోగంలోకి రాని ఆపరేషన్ థియేటర్
కూర్చునేందుకు బల్లలు,తాగునీటి కొళాయిలూ లేవు
వైద్యం కోసం రోగుల అవస్థలు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో నాలుగేళ్లకు పైగా కాలయాపన చేసి సుమారు 30 కోట్ల రూపాయలతో నిర్మించిన పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్లో రోగులకు వైద్యం కోసం అవస్థలు తప్పడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రి కంటే ధీటుగా భవన నిర్మాణం చేసిన అధికారులు అందులో కనీసం సాధారణ వైద్యసేవలైనా అందేలా చూడడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రామా సెంటర్ను అధికారికంగా జనవరిలో ప్రారంభించినా వైద్యసేవలు మాత్రం గత నెలలోనే ప్రారంభమయ్యాయి. అత్యవసర వైద్యసేవల విభాగం(క్యాజువాలిటీ), ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్(ఏఎంసీ), ఎక్స్రే, సి.టి.స్కాన్, ఈసీజీ ,ల్యాబ్ తదితర వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో తొలుత వైద్యసేవలను అందిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వచ్చే రోగులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయక పోవడంతో రోగుల అవస్థలు పడుతున్నారు. కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేదా బల్లలు కూడా అధికారులు ఏర్పాటుచేయలేదు.
కొత్త భవనంలో ఎక్కడా కూడా రోగులకు తాగేందుకు మంచినీటి కుళాయి ఏర్పాటు చేయలేదు. కొన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలకు తప్పనిసరిగా రోగులు మంచినీరు తాగి వెళ్లాలి. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం కుర్చునేందుకు బల్లలు, తాగేందుకు మంచినీటి వసతి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్లలో ఉన్న కుళాయిల్లో నీటి సరఫరా సక్రమంగా రావటం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా నిర్మించినప్పటికి నీటి సరఫరా లేకపోవటంతో టాయ్స్లెట్స్కు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్స్ కోసం ఏర్పాటు చేసిన గదులు అలంకార ప్రాయంగానే ఉంటున్నాయే తప్పా సకాలంలో విధులకు హాజరుకావటం లేదనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. రాత్రివేళల్లో ఎక్కువగా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి.
పనిచేయని ఏసీలు... నాలుగు రోజులుగా క్యాజువాలిటీలో ఏసీలు పనిచేయటం లేదు. ఏసీల చల్లదనం బయటకు పోకుండా గదులను పూర్తిగా మూసివేసి నిర్మాణాలు చేయటంతో నేడు అవి పనిచేయక గదుల్లో ఉంటున్న రోగులు అల్లాడిపోతున్నారు. ప్రారంభమైన రెండునెలలకే సెంట్రల్ ఏసీలు పనిచేయకపోవటం ఇంజనీరింగ్ అధికారుల పనితీరుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు. ప్రాణాపాయ స్థితిలోఉండే రోడ్డు ప్రమాద బాధితులు, వ్యాధి బాధితులు అత్యవసర విభాగంలో ఏసీలు పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు.
ఆపరేషన్ థియేటర్ ఊసేది... భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం ట్రామాకేర్ సెంటర్లో ఆపరేషన్ థియేటర్ తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. జీజీహెచ్ అధికారులు చిన్న ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటుచేశారు. అది ఆపరేషన్లు చేసేందుకు ఏమాత్రం సరిపోకపోవటంతో రెండునెలలుగా వినియోగంలోకి రాకుండా అలంకార ప్రాయంగానే ఉంది.
నిబంధనల ప్రకారం ట్రామాకేర్ సెంటర్లో మేజర్ ఆపరేషన్ థియేటర్ను నిర్మిస్తేనే ఆపరేషన్లు చేసే వీలుంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ క్యాజువాలిటిలో లేక పోవటంతో బాధితులను, రోగులను పాతబిల్డింగ్(ఇన్ పేషేంట్ విభాగం) లోకి తరలించేందుకు అధిక సమయం పడుతుందని, ఈ లోగా ప్రమాధ బాధితులకు గోల్డెన్ అవర్లో అందాల్సిన వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని పలువురు రోగులు కోరుతున్నారు. క్యాజువాలిటీలో రోగులు అవస్థలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావును వివరణ కోరగా రోగులకు వైద్య పరీక్షల గది వద్ద నిలబడి ఉండకుండా కుర్చీలు, బల్లలు త్వరలోనే కొనుగోలు చేయిస్తామన్నారు. ఆపరేషన్ థియేటర్స్ నిర్మాణం పై విభాగంలో కొనసాగుతున్నట్లు తెలిపారు.