వింతనానేనా!
మాంగల్యం
చైనాలోని తుజియా తెగలో ఒక ఆచారం ఉంది! పెళ్లి ఫిక్స్ అవగానే అమ్మాయి ఏడుపు మొదలు పెడుతుంది. రోజూ ఉదయాన్నే ఆ పిల్లకు అదే పని. పెళ్లి రోజు వరకు తీరిక చిక్కినప్పుడల్లా వధువు కళ్లు అలా కుండపోతగా కురుస్తూనే ఉంటాయి. ఆమెతో పాటు ఆమె తల్లి, ఆ తల్లికి తల్లి, ఇంకా దగ్గరి మహిళా బంధువులంతా కూర్చొని ఏడుస్తుంటారు. పెళ్లయిపోగానే వర్షం ఆగినట్లు వధువు కన్నీటి బాష్పాలు ఆగిపోతాయి. ప్రాచీన చైనాలో ఇదొక ఆచారం. ఒక్క చైనా అనేముందీ.. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ పెళ్లి ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని ఎంత వింతగా, విడ్డూరంగా ఉన్నాయో చూడండి!
ముఖాలకు బొగ్గు పొడి
స్కాట్లాండ్లో పెళ్లికి ఒకరోజు ముందు వధూవరుల ముఖాలకు నల్లసిరా, బొగ్గుపొడి పులుముతారు. అలా చేస్తే ప్రేతాత్మలు వారి దరి చేరవట!
తుపుక్కుమని దీవిస్తాడు
కెన్యాలోని మాసాయి తెగలో అప్పగింతలప్పుడు వధువు ముఖం మీద, ఎద మీద ఆమె తండ్రి ఉమ్మి ఊస్తాడు. అది దీవించడం! ఆ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూడకుండా మెట్టినింటికి వెళ్లిపోవాలి. ఒక వేళ తల తిప్పి చూస్తే ఆమె శిలగా మారిపోతుందని మాసాయి తెగల ప్రజలు నమ్ముతారు.
ఫస్ట్‌నైట్ జరగనివ్వరు!
ఫ్రాన్స్‌లో వధూవరుల ఫస్ట్‌నైట్ జరుగుతుంటే స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఆ ఫస్ట్ నైట్ జరిగే గది బయట పెద్దగా డ్రమ్స్ కొడుతూ, కర్ణకఠోరంగా బూరలు ఊదుతూ, చప్పుడొచ్చే వస్తువులను ఎత్తి కొడుతూ నానా బీభత్సం సృష్టిస్తారు. అప్పుడు ఆ నూతన వధూవరులు తలుపు తెరుచుకుని బయటికి వచ్చి అక్కడున్న వాళ్లందరికీ స్వీట్స్ పంచుతారు. ఈ కార్యక్రమాన్ని ‘చరివరి’ అంటారు.
వధువును ఎత్తుకెళతారు!
రొమేనియాలో సరిగ్గా పెళ్లికి ముందు వధువు ఫ్రెండ్స్ వధువును అపహరించుకుని వెళ్తారు. ఓ రహస్య ప్రదేశంలో దాచేస్తారు. అప్పుడు వరుడు రంగంలోకి దిగాలి. వాళ్లను వీళ్లను పట్టుకుని, వారికి కొన్ని సీసాల మద్యాన్ని బంధ విమోచన రుసుంగా చెల్లించి, ఒక ప్రణయగీతాన్ని ఆలపించి వధువును విడిపించుకుని తెచ్చుకోవాలి.
కాచుకో... కన్యకా..!
చైనాలోనే యుగర్ అనే తెగ ఉంది. వరుడు విల్లును ఎక్కుపెట్టి, నారిని లాగిపట్టి వధువు గుండెను తాకేలా మూడు బాణాలు వదులుతాడు. కంగారు పడకండి. అవేం సూటిగా ఉండే బాణాలు కాదు. సుతిమెత్తగా ఉండే శరాలు. వధువుకు తగిలి, కింద పడిన ఆ శరాలను వరుడొచ్చి ఏరుకుని, వాటిని రెండుగా విరిచేస్తాడు. అలా చేస్తే వివాహబంధం బలపడుతుందని నమ్మకం.
చెప్పులు దొంగిలిస్తారు
ఉత్తర భారతదేశంలో కొన్నిచోట్ల ఓ ఆచారం ఉంది. పెళ్లింట వధువు ఫ్రెండ్స్.. వరుడి చెప్పులు దొంగిలిస్తారు. వేల రూపాయల్ని మూల్యంగా చెల్లించుకుంటే తప్ప ఆ చెప్పుల్ని తిరిగి ఇవ్వరు.
చేప (బాదుడు) మందు
కొరియాలో పెళ్లి కొడుకు స్నేహితులు పెళ్లికొడుకు కాళ్లను తాళ్లతో కట్టేసి, అతడి పాదాలను కోర్వీనా జాతి చేపతో, లేదంటే ఒక బెత్తంతో కొడతారు. అలా చేస్తే ఫస్ట్ నైట్ జరగవలసిన కార్యం కోసం వరుడు రాటుదేలుతాడట!
మగ పెళ్లికూతురు!
రష్యాలో పెళ్లికి ముందే పెళ్లికూతుర్ని చూడాలని పెళ్లికొడుకు ఆశ పడితే అతడు కొంత డబ్బు చెల్లించాలి. పెళ్లి కూతురు తన ఇంట్లో ఉంటుంది. పెళ్లికొడుకు అక్కడికి వెళ్లి చూడాలి. అలా చూడ్డం కోసం పెళ్లి కొడుకు ఇచ్చిన డబ్బు సరిపోకపోతే ఇంట్లోంచి పెళ్లి కూతురు మగబంధువు ఒకడు పెళ్లికూతురు వేషంలో వచ్చి కనిపిస్తాడు. దాంతో ఠారెత్తిన పెళ్లికొడుకు మరికొంత రుసుం చెల్లిస్తాడు. అప్పుడు మాత్రమే అమ్మగారి దర్శనం కలుగుతుంది అబ్బాయిగారికి.