కొడుకును చంపి సాప్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
పుణె: జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళా సాప్ట్వేర్ ఇంజనీర్... కొడుకును చంపి, అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది. క్షణికావేశంతో కొడుకును అతి దయనీయంగా హతమార్చిన దీప్తి మోరె, మర్నాడు ఉదయం అపార్ట్ మెంట్ మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇనస్ట్రుమెంటల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నదీప్తి మోరె(34) కొడుకు ఆర్నవ్(5), భర్త తేజాస్‌తో కలిసి పుణేలో విలాసవంతమైన ఏరియాలో నివస్తోంది.
ఏమైందో ఏమో తెలియదు గానీ భర్త వేరే గదిలో నిద్రిస్తుండగా, శనివారం తెల్లవారుఝామున దీప్తి.. కొడుకు ఆర్నవ్ గదిలోకి వెళ్లి అతడి చేతిమణికట్టు కోసి, తరువాత గొంతు నులిపి హత్య చేసింది. ఆదివారం ఉదయం ఏడుస్తూ భర్తతో ఈ విషయాన్నిచెప్పింది. అతడు ఆందోళనతో పిల్లాడి చూసేందుకు గదిలోకి వెళ్లాడు. ఇంతలో తన గదిలో గడియ పెట్టుకున్న దీప్తి బాల్కనీలోంచి దూకేసింది. తేజాస్ ఇరుగు పొరుగువారి సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
ఘటనా స్థలంలో దీప్తి మోరె రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసపులు దర్యాప్తు మొదలు పెట్టారు. తనకు జీవితంలో చాలా ఆశలు ఉన్నాయని, అయితే ఏదీ తాను అనుకున్నట్టుగా జరగడం లేదనే ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఆ సూసైడ్ నోట్ లో పేర్కొంది అందుకే కొడుకుతో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో మానసిక వేదనతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి సుధాకర్ పథేర్ తెలిపారు.