వినయమే బలం.. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని విర్రవీగితే ఇక అంతే!
ఒకడు బాగా రాస్తాడు, ఒకడికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒకడు బాగా పాడతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మాట్లాడతాడు...ఏది ఉన్నా అది భగవంతుడు వాడికి ఇచ్చిన విభూతి. ‘‘యద్యత్ విభూతిరాతిమత్ సత్వం శ్రీమదూర్జిత మేవనా/తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్’’ అంటాడు గీతాచార్యుడు. ఎక్కడెక్కడ ఏ ఉత్కృష్టమయిన ప్రాణి ఉన్నా అది పరమేశ్వరుడి విభూతి. ‘అది ఈశ్వరుడు నాకు అనుగ్రహించిన మహత్తరమైన శక్తి’ అని ఎవరయితే నమస్కారం పెట్టి వినయంతో బతుకుతుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు.
ఇదంతా నా మహిమే.. నాతో సాటిరాగల వాడు లేడు.. అని విర్రవీగుతాడో వాడు ఎప్పటికీ ముందుకు పోలేడు. పాడయి పోతాడు. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని ఎవర్నయినా తూలనాడుతూ తక్కువచేసి ప్రవర్తిస్తే... అవతలి వాడు సాధనచేసి ఏదో ఒకరోజు నిన్ను దాటిపోతాడు. నిజంగా అవతలివాడు నీకన్నా తక్కువ అనిపించినప్పుడు సానుభూతితో, ప్రేమతో పెద్ద మనసు చేసుకొని వాడిని వృద్ధిలోకి తీసుకురావడానికి నీ వంతు ప్రయత్నం నీవు చేయడం ధర్మం అవుతుంది. అది లేనప్పుడు...
‘‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతింబొందరే?/వారేరీ సిరిమూటగట్టుకుని పోవంజాలరే? భూమిపై/ బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై/యీరే కోర్కులు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!’’ ఈ పద్యం మనందరికీ తెలిసిందే. అంటే పొగరుబోతు తనంతో నీవు బావుకునేదేమీ ఉండదు. వినయంతో ప్రవర్తించిన వాళ్ళను చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. సంస్కృత భాగవతాన్ని అద్భుతంగా ఆంధ్రీకరించిన పోతనామాత్యుడు ఎక్కడా ఆ ప్రతిభ తనదికానే కాదన్నాడు.
‘‘పలికెడిది భాగవతమట/పలికించు విభుండు రామభద్రుండట /నేపలికిన భవహరమగునట/పలికెద; వేరొండు గాథ పలుకగనేలా!’’ అన్నాడు. నేను కానే కాదు, ఆ రామచంద్రమూర్తి నా వెనుక ఉండి నాచేత దానిని ఆంధ్రీకరింప చేస్తున్నాడు. ఆయన నాతో ఏది చేయిస్తున్నాడో అదే చేస్తాను తప్ప మరొకటి చేసే శక్తి నాకు లేదు... అని నిలబడినందుకు తరతరాలుగా ప్రజలు ఆ మహాకవిని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు.
హనుమ కూడా... ‘లంకకు వెళ్లిరాగల శక్తి నాకు పుష్కలంగా ఉంది’ అన్లేదు. రామచంద్ర మూర్తి బంగారు కోదండాన్ని పట్టుకొని అక్షయ బాణ తూణీరం లోంచి ఒక బాణాన్ని తీసి వింటినారిని సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టినప్పుడు రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో ఆయన అనుగ్రహంతో ఆయన శక్తి నాలో ప్రవేశించినందువల్ల లంకాపట్టణానికి వెళ్ళగలుగుతున్నాను తప్ప నాకుగా ఆ శక్తి లేదు’ అని సవినయంగా చెప్పుకొన్న కారణంతో సదా రాముడి కనుసన్నలలో మెలిగే అదృష్టాన్ని పొందాడు హనుమ. అందుకే ఈరోజున రాముడి గుడి లేని ఊరు లేనట్టే, హనుమంతుడి విగ్రహం లేని వీథి లేదు.
వినయం అంటే అదీ. బలవంతుడనాకేమని ...అని చెప్పిన బద్దెన గారే సుమతీ శతకంలో మరో చోట ఇలా అంటారు. ‘‘అధరము గదిలియు గదలక / మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడై/ అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడబాపము సుమతీ’’... అధికారంతో విర్రవీగుతూ ఎవరితో మాట్లాడనివాడు అధికారం అన్నరోగం సోకి శవంగా మారినవాడు...అని ఘాటుగా విమర్శించారు. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తిన్నట్లుగా తెలుగులో ఉన్న మంచి పద్యాలను కూడా జ్ఞాపకం పెట్టుకొంటే జీవితంలో అక్కరకు వస్తాయి.
(సుమతీ శతక నీతి పద్యాలు ఇంతటితో సమాప్తం)
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు