జయప్రకాష్ దీక్ష విరమణ
రాజోలు, న్యూస్‌లైన్ : జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ రాజో లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ చేపట్టిన నిరవధిక దీక్షను శనివారం విరమించారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు చింతలపాటి వెంకట్రామరాజు, మట్టా శైలజ, కొండేటి చిట్టిబాబు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేగి రాజు సాయిరాజు, సీనియర్ నాయకుడు చిన్నం ప్రవీణ్‌బాబు తదితరులు జయప్రకాష్‌కు నిమ్మరసం ఇచ్చి, దీక్ష విరమింపజేశారు. ఏడు రోజులుగా జయప్రకాష్ ఆమరణ దీక్ష చేస్తున్న విషయం విదితమే. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టినప్పటి నుంచి మత్తి జయప్రకాష్ నిరవధిక దీక్ష ప్రారంభించారు.
ఇలాఉండగా డాక్టర్ సువర్ణరాజు ఆధ్వర్యంలో జయప్రకాష్‌కు వైద్య పరీ క్షలు నిర్వహించి, ప్లూయిడ్స్ ఎక్కించారు. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తొలుత పాస్టర్లు సందిపూడి ఏలియా, బళ్ల నవరత్నం, సిస్టర్ పితాని సత్యవతి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయప్రకాష్‌ను పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యురాలు ఎన్.వసుంధర, నాయకులు మందపాటి కిరణ్‌కుమార్, అనితా శుభజ్యోతి, బొలిశెట్టి భగవాన్, గుబ్బల నారాయణరావు తదితరులు పరామర్శించారు.