ష్..గప్‌చుప్
నేటి సాయంత్రంలో ప్రచారానికి తెర
అరకు, పాడేరుల్లో 4 గంటల వరకే
అభ్యర్థుల సుడిగాలి పర్యటన
గెలుపే లక్ష్యంగా టీడీపీ తాయిలాలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుం ది. ఎన్నికల ప్రచారానికి సోమవారం సా యంత్రం తెరపడనుం ది. నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపునకు 48 గంట ల ముందు ప్రచారాన్ని ఆపేయాలి. ఇన్నాళ్లూ పట్టణాలు, పల్లెల్లో హోరెత్తిన రాజకీయపార్టీల మైకులు మూగబోనున్నాయి. ఇక డోర్‌టుడోర్ కేంపెయిన్‌కు అభ్యర్థులు రంగం సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 7న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుంది. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే నిర్వహిస్తారు. దీంతో ఈ రెండు నియోజకవ ర్గాల్లోనూ సోమవారం సాయంత్రం 4 గంటలకే ప్రచారాలు నిలిచిపోనున్నాయి. రెండు రోజులే ఎన్నికలకు సమయం ఉండడంతో జిల్లాలోని అ న్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం జోరందుకుంది.
అన్ని పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు దూసుకుపోతున్నారు. ఉన్న తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలుసుకోవడానికి అభ్యర్థుల అనుయాయులు బృందాలుగా విడిపోయి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులూ ఇంటింటికి తిరిగి తమ వారికి ఓట్లు వేయాలని కోరుతున్నారు.
ప్రలోభాల పర్వానికి టీడీపీ తెర
పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ఎన్ని రూ. కోట్లు ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీతో ఓటర్లను తమ వైపునకు తిప్పుకోడానికి టీడీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నగదు కుమ్మరిస్తున్నారు. గ్రామాల్లోనే కాకుండా విశాఖ నగరంలో కూడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. కులసంఘాలు, మహిళా సంఘాలకు తాయిళాల ఎర వేసి తమ వైపు తిప్పుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా గంపగుత్తుగా ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు. విశాఖ-తూర్పు నియోజకవర్గంలో ఓటుకు రూ.500 నుంచి రూ. వెయ్యి ఇవ్వడానికి ప్రణాళికలు చేసుకున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. భీమిలి నియోజకవర్గంలో గ్రామాలకు గ్రామాలను కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఓటుకు రూ.వెయ్యితో పాటు ఉచిత భోజనాల మెస్‌లు ఏర్పాటు చేశారు. విశాఖ-ఉత్తరంలో కూడా ఇంటింటికి నిత్యావసర సరుకులతో పాటు ఓటుకు రూ.500 నుంచి నుంచి రూ. వెయ్యి పంపిణీ చేస్తామంటూ స్లిప్పులు రాసిస్తున్నారు.
ప్రచారం ముగింపు అనంతరం డబ్బు పంపిణీకి ప్రతీ ప్రాంతంలోను ఏజెంట్లను నియమించారు. వీటితో పాటు ప్రధానంగా యువతకు క్రీడా సామాగ్రి, ఆటవస్తువులు, మహిళలకు చీరలు పంచిపెడుతున్నారు. ఇక మందుబాబుల పంట పండుతోంది. తాగినోడికి పీకలదాక మందు పట్టిస్తున్నారు. గ్రామాల్లో సైతం ఎన్నికల ప్రచార సందడి హోరెత్తిపోతోంది. ఎన్నికలకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి వ్యూహరచనలు చేస్తున్నారు.