అపర చాణక్యుడికి గురువు
హైదరాబాదీ
బూర్గుల రామకృష్ణారావు
అపర చాణక్యుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు గురువు ఆయన. హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజల ద్వారా ఎన్నికైన మొట్టమొదటి, చిట్టచివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే. న్యాయవాదిగా, బహుభాషావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు పాత్ర హైదరాబాద్ చరిత్రలో చిరస్మరణీయమైనది. నిజాం వ్యతిరేక పోరాటంలోనూ కీలక పాత్ర పోషించిన ఆయన, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకాలోని పడకల్ గ్రామంలో 1899 మార్చి 13న జన్మించారు.
ఆయన పాఠశాల విద్య హైదరాబాద్‌లోనే సాగింది. ఇక్కడి ధర్మవంత్ అండ్ ఎక్సెల్షియర్ హైస్కూల్లో చదువుకున్నారు. పుణేలోని ఫెర్గుసన్ కాలేజీ నుంచి బీఏ (ఆనర్స్), బాంబే యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్‌లో ప్రాక్టీస్ ప్రారంభించి, అనతికాలంలోనే ప్రఖ్యాత న్యాయవాదుల్లో ఒకరిగా ఎదిగారు. బూర్గుల వద్ద మాజీ ప్రధాని పీవీ జూనియర్‌గా పనిచేశారు. న్యాయవాదిగా ప్రాక్టీసు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలంలోనే స్వామీ రామానంద తీర్థ తదితర నేతలతో కలసి నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు.
మాతృభాషలో విద్యాబోధన చేయడమే లక్ష్యమని చెప్పుకుంటున్న నిజాం ప్రభుత్వం ఉర్దూ మాతృభాష కాని తెలుగు విద్యార్థులకు ఉర్దూలో ఎందుకు విద్యాబోధన చేస్తోందని సభాముఖంగా ప్రశ్నించిన ధీశాలి బూర్గుల. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఆయన చురుకుగా వ్యవహరించారు. దేవరకొండలో 1913లో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. స్వతహాగా పండితుడైన బూర్గుల తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయోద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1942లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నందుకు నిజాం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
ముఖ్యమంత్రిగా సుపరిపాలన..
పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్రం 1948లో భారతదేశంలో విలీనమవడంతో వెల్లోడి ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వంలో బూర్గుల రెవెన్యూ మంత్రి పదవి చేపట్టారు. ఆ పదవిలో ఉండగానే, వినోభా భావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్ధత కల్పించారు. హైదరాబాద్ రాష్ట్రానికి 1952లో మొదటిసారి జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
పూర్తి మెజారిటీ లేకపోయినా, మంత్రివర్గ సహచరుల నుంచి తగిన సహకారం లేకున్నా, 1956లో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేంత వరకు విజయవంతంగా పదవిలో కొనసాగారు. స్వీయ ప్రయోజనాలు, పార్టీ లాభనష్టాల కంటే ప్రజాప్రయోజనాలే పరమావధిగా పరిగణించి పనిచేసిన నాయకుడు ఆయన. విశాలాంధ్రకు మద్దతు తెలిపిన బూర్గుల, రాష్ట్ర విలీనం తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పూర్తిగా రచనా వ్యాసంగానికి, ఆధ్యాత్మిక చింతనకు పరిమితమయ్యారు.
పాండిత్యానికి నిదర్శనాలు..
పారశీక వాఙ్మయ చరిత్ర బూర్గుల బహుభాషా పాండిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. జగన్నాథ పండితరాయల ‘లహరీ పంచకం’, ఆదిశంకరుల ‘సౌందర్యలహరి’, ‘కనకధారాస్తవము’ తెలుగులోకి అనువదించారు. ఇవి కాకుండా, తెలుగులో కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, శారదాస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం వంటి రచనలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1953లో, ఉస్మానియా విశ్వవిద్యాలయం 1956లో ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.