పాక్ ఐఎస్ఐ నుంచే ఐఎంకు నిధులు: ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ నుంచి హవాలా మార్గంలో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని, ఆ డబ్బుతోనే వారు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి విధ్వంసాలకు పాల్పడుతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టుకు స్పష్టం చేసింది. స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్(సిమీ) సంస్థే.. ఐఎంగా మారిందని, దీనికి యాసిన్ భత్కల్ నేతృత్వం వహిస్తున్నాడని వివరించింది. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ పేలుళ్లలో రెండో నిందితుడిగా ఉన్న భత్కల్ను ఢిల్లీ నుంచి నగరానికి తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
దీంతో కోర్టు భత్కల్కు అక్టోబరు 17 వరకు రిమాండ్ విధించింది. అయితే, ఐఎస్ఐతో ఐఎంకున్న సంబంధాలు, పేలుళ్ల కుట్రలపై వివరాలు రాబట్టేందుకు భత్కల్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. ఐఎస్ఐ నుంచి వచ్చిన నిధులతో దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు పాల్పడ్డారని తెలిపింది. ఈ క్రమంలో భత్కల్ తరఫు న్యాయవాది ముజఫరుల్లా వాదిస్తూ, భత్కల్ను ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తీసుకెళ్లి విచారించారని, కొత్తగా విచారించాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. వాదనల అనంతరం మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి.లక్ష్మీపతి, పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తూ, మంగళవారం నుంచి అక్టోబరు 8 వరకు (15 రోజులు) భత్కల్ను ఎన్ఐఏ కస్టడీకి అప్పగించారు.