సహజ వనరులపైనే దేశాభివృద్ధి
భీమవరం : దేశం అభివృద్ధి చెందడానికి సహజ వనరులపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుందని, దానిలో భూవనరులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ ఏవీవీఎస్ కామరాజు చెప్పారు. భీమవరం డీఎన్నార్ కళాశాలలో శనివారం జియాలజీ విభాగం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి, ప్రాణహిత గోదావరి పరిసరాల్లో చమురు, సహజ వాయువుఅన్వేషణ అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. చమురు ఉత్పత్తి సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ దేశంలోనే అతిపెద్దదని, ఇంధన వనరుల్లో ఆసియాలో ఐదోస్థానంలో ఉందన్నారు. ఇంధన వనరులైన చమురు, గ్యాస్, బొగ్గు, అణుశక్తి ఖనిజాలు అపారంగా లభిస్తే ఆ దేశం అభివృద్ధికి ఎంతగానో తోడ్పతాయని కామరాజు వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు నిక్షేపాలు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉన్నాయన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఎంతో ప్రతిష్టాత్మకమైన జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. రాష్ట్రంలో బీఎస్సీ కోర్సులో జియాలజీతో పాటు కంప్యూటర్స్, మేథమెటిక్స్ ఉన్న గ్రూపు కలిగింది డీఎన్నార్ కళాశాలేనన్నారు. ఈ తరహా కోర్సులు మన దేశంలో కేవలం నాలుగు కళాశాలల్లో మాత్రమే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ డెప్యూటీ జనరల్ మేనేజర్ రత్నం, కళాశాల జియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఎ.సురేంద్ర, అధ్యాపకులు పాల్గొన్నారు.