కబడ్డీ ‘క్వీన్స్’
ప్రొ కబడ్డీ మహిళల విజేత స్ట్రామ్ క్వీన్స్
ఫైనల్లో ఫైర్‌బర్డ్స్‌పై సంచలన విజయం
చివరి సెకన్లలో డ్రామా
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ మహిళల విభాగంలో విజయ ‘తుఫాను’ రేగింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో స్ట్రామ్ క్వీన్స్ విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో క్వీన్స్ 24-23 పాయింట్ల తేడాతో ఫైర్ బర్డ్స్‌పై విజయం సాధించింది. చివరి సెకను వరకు గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడినా... ఆఖరి క్షణంలో తేజస్వినీ బాయి అద్భుత రైడింగ్‌తో రెండు పాయింట్లు సాధించి క్వీన్స్‌ను గెలిపించింది. స్ట్రామ్ జట్టు తరఫున సాక్షి కుమారి ఆరు రైడింగ్ పాయింట్లు సహా మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోర్ చేసింది. బర్డ్స్ మహిళలలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కె.రింజు ఏడు పాయింట్లతో ఆకట్టుకుంది. ఫైర్ కెప్టెన్ మమతా పుజారి పూర్తిగా విఫలం కావడం ఆ జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి 10-8తో స్వల్ప ఆధిక్యంలో నిలిచిన బర్డ్స్ చివరకు మ్యాచ్ కోల్పోయింది.
సెకన్ల వ్యవధిలో....: మహిళల ఫైనల్లో చివరి నిమిషంలో డ్రామా చోటు చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్కో పాయిట్ కోసం పోరాడుతూ చివరి వరకు సమంగా నిలుస్తూ వచ్చాయి. 29వ నిమిషం ముగిసేసరికి 22-17తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న ఉన్న క్వీన్స్ విజయానికి చేరువైంది. అయితే 30వ నిమిషంలో బర్డ్ రైడర్ రింజు 3 పాయింట్లు కొల్లగొట్టింది. అయితే ఈ దశలోనూ క్వీన్స్ 22-20తో ముందంజలో ఉంది. ఆ వెంటనే బర్డ్స్ కెప్టెన్ మమతా పూజారి తర్వాతి రైడింగ్‌లో మరో 3 పాయింట్లు రాబట్టడంతో జట్టు 23-22తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వెళ్లింది. గెలుపు ఖాయమైందని భావించిన అమ్మాయిలు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ మరో రెండు సెకన్లలో మ్యాచ్ ముగిసే సమయంలో స్ట్రామ్ కెప్టెన్ తేజస్వినీ బాయి ప్రత్యర్థి కోర్టులోకి దూసుకుపోయింది. బర్డ్స్ కోలుకునే లోపే రెండు పాయింట్లు స్కోర్ చేసి తమ జట్టును విజేతగా నిలిపింది. క్వీన్స్ ఆనందంతో గంతులు వేయగా, బర్డ్స్ మహిళలు నిరాశలో మునిగారు.