షరపోవాకు చుక్కెదురు
స్టట్గార్ట్ (జర్మనీ): టైటిల్ సాధించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని ఆశించిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు నిరాశ ఎదురైంది. స్టట్గార్ట్ ఓపెన్ టోర్నమెంట్లో షరపోవా పోరాటం సెమీఫైనల్లోనే ముగి సింది. ఫ్రాన్స్ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాడెనోవిచ్తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో షరపోవా 6–3, 5–7, 4–6తో పోరాడి ఓడిపోయింది.
2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో షరపోవా ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన షరపోవా రెండో సెట్లో 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయి సెట్‌ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో సెట్లో పదో గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన మ్లాడెనోవిచ్ సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.