ఇక సెగే..
‘ఖేడ్’ ఉపపోరు మరింత హోరు
♦ ముగిసిన గ్రేటర్ ఫైట్ నేతల దృష్టి ఖేడ్పైనే
♦ వేడెక్కనున్న రాజకీయాలు
♦ ఇప్పటికే చుట్టేసిన మంత్రి హరీశ్‌రావు
♦ క్యూకట్టనున్న ఆయా పార్టీల నేతలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గ్రేటర్ ఫైట్ ముగియడంతో ఇక అందరి దృష్టి నారాయణఖేడ్ ఉపపోరుపై పడింది. అన్ని పార్టీల నేతలంతా ఇక్కడే మకాం వేసి ప్రచారాన్ని వేడెక్కించనున్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లలో మంగళవారం జీహెచ్ఎంసీ పోలింగ్ పూర్తయింది. అయితే గ్రేటర్ వాసులు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రధానంగా పోటీపడ్డాయి. మహానగరంలో టీడీపీ, బీజేపీ రాజకీయ పొత్తుతో బరిలో నిలబడితే.. పటాన్చెరు డివిజన్లో ఆ రెండు పార్టీలు మాత్రం వేర్వేరుగా పోటీ చేశాయి. అన్ని పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచినట్టు ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు. మూడు సీట్లను మూడు ప్రధాన పార్టీలు ఒక్కొక్కటి చొప్పున గెలుచుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
ఇక ఖేడ్‌కు నేతల వలస..
ఇప్పటివరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఆయా పార్టీల నేతలు తాజాగా నారాయణఖేడ్ బాట పట్టనున్నారు. టీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీల నాయకులు ప్రచారానికి దూరంగా ఉన్నారు.
గ్రేటర్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక సదరు నాయకులంతా నారాయణఖేడ్ వైపు క్యూ కట్టనున్నారు. ఖేడ్ ఉప ఎన్నికల్లో ఒక్క టీఆర్ఎస్ మాత్రమే చెప్పుకో తగిన స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని చేపడుతోంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే ఇక్కడ మకాం వేశారు. దాదాపు రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులతో ప్రజల్లోకి వెళ్లారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత పూర్తి సమయాన్ని నారాయణఖేడ్ నియోజకవర్గానికే కేటాయించారు. అవకాశం ఉన్నప్పడు రాత్రి బస కూడా నియోజకవర్గంలో చేశారు. దాదాపు అన్ని గ్రామాల్లో కలియదిరిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి కంటే కూడా హరీశ్‌రావే ఎక్కువగా పర్యటించారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, దేవేందర్‌రెడ్డి తదితరులు మండలానికి ఒకరి చొప్పున ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారు. మొత్తానికి హరీశ్‌రావు మంత్రాంగంతో నియోజకవర్గంలోని మండలాల్లో ఇప్పటికే కారు గుర్తును పటిష్టమైన స్థితికి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ తరఫున దామోదర్...
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు పి.సంజీవరెడ్డి బరిలో నిలిచారు. నోటిఫికేఫన్ నాటి నుంచి వారి కుటుంబ సభ్యులు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. మధ్యలో ఒకసారి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా, మాజీ మంత్రి సునీతారెడ్డి ఒక్కటి, రెండు రోజులు తిరిగిపోయారు. సంజీవరెడ్డి ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్తున్నారు. తన తండ్రి కిష్టారెడ్డి చేసిన సేవలు, పనులను గుర్తుచేస్తూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సంజీవరెడ్డికి ఆయన సోదరులు, కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు.
టీడీపీ అభ్యర్థి ఒంటరి ప్రచారం...
ఇక టీడీపీ ప్రచారంలో బాగా వెనుకబడి ఉంది. పార్టీ అభ్యర్థి ఎం.విజయ్‌పాల్‌రెడ్డి ఒక్కరే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ రోజు పార్టీ నేతలు వచ్చి కొంత హడావిడి చేసి వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పటివరకు రాలేదు. గ్రేటర్ ఎన్నికలు ముగిసినందున ఇక అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు ఉప ఎన్నికలకు తరలిరానుండటంతో నారాయణఖేడ్ రాజకీయాలు వేడెక్కుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.