తీవ్రవాదులను సమర్ధంగా ఎదుర్కొంటాం
హైదరాబాద్: తీవ్రవాదుల కార్యకలాపాలను సమర్ధంగా ఎదుర్కొంటామని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భాంమ్రే స్పష్టం చేశారు. ఎంతో కాలంగా మన దేశం ఈ సమస్యతో పోరాడుతోంది. దీనిని నిర్మూలించే సత్తా ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. లక్నో ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లక్నో రైలు పేలుడు ఘటన జరిగిన 12 గంటల్లోనే కీలక సూత్రధారి సైఫుల్లాను తీవ్రవాద వ్యతిరేక భద్రతా బలగాలు కాల్చి చంపాయని తెలిపారు. సైఫుల్లాను ఐసిస్ మద్దతుదారుగా అనుమానిస్తున్నట్లు ఆయన వివరించారు. తీవ్రవాద ముప్పును నేడు ప్రపంచదేశాలన్నీ గుర్తించాయని చెప్పారు. పెను సవాలుగా మారిన ఐసిస్‌ను తుదముట్టించేందుకు అన్ని దేశాలు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.