భారీగా దొరికిన పెద్దనోట్లు, చిక్కుల్లో మంత్రి
ముంబై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాక ఆ పార్టీకే చెందిన ఓ మంత్రి ఇరకాటంలో పడ్డారు. 91 లక్షలా 50 వేల రూపాయల విలువైన 500, 1000 రూపాయల నోట్లను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు దొరికిన ఈ నగదు తనదేనని ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సుభాష్ దేశ్‌ముఖ్ చెప్పారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఈ డబ్బు తన వద్ద ఉంచుకున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. తాను ఈ డబ్బును అక్రమంగా దాచుకోలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి చెప్పారు.
సోలాపూర్‌లో మంత్రికి చెందిన ఎన్జీవో వాహనంలో డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం తెలియగానే ప్రజలు షాకయ్యారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో 500, 1000 రూపాయల నోట్లను గుర్తించామని, డబ్బుతో పాటు వాహనాన్ని సీజ్ చేసినట్టు ఉస్మానాబాద్ కలెక్టర్ ప్రశాంత్ నార్నవేర్ ధ్రువీకరించారు. ఈ డబ్బును జిల్లా ట్రెజరీలో డిపాజిట్ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేయాలని పోలీసులకు, ఐటీ అధికారులకు సూచించినట్టు తెలిపారు.
ఈ మొత్తం తమదని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి తీసుకెళ్తున్నట్టు తొలుత లోక్ మంగళ్ గ్రూప్ ఉద్యోగి చెప్పారు. కాగా రోజు తర్వాత అంటే శుక్రవారం మంత్రి దేశ్‌ముఖ్ స్పందిస్తూ ఈ డబ్బు తనదేని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికో లేదా అక్రమంగా దాచుకున్నదో కాదని చెప్పారు. ఆయనపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి మంత్రి పదవి నుంచి దేశ్‌ముఖ్‌ను తొలగించాలని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ముందే బీజేపీ నాయకులకు లీక్ చేశారని ఆరోపించారు.