గిరిజన వర్సిటీని జిల్లాలో ఏర్పాటు చేయాలి...!
పార్వతీపురం: గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి వవినతతి పత్రం అందజేసినట్లు ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సచివాలయంలో శుక్రవారం ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి చిన్నప్పను కలిశామని చెప్పారు.
రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించామని, అలాగే ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ, ఉద్యోగులు సమావేశాలను నిర్వహించుకునేందుకు ప్రతి జిల్లాలో అంబేద్కర్ స్మారక భవనాలను ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించాలని కోరామని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీచేయాలని, గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ పోస్టులను భర్తీచేయాలని, ఏజెన్సీలో గల ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ అందజేయాలని కోరామన్నారు. కార్యక్రమంలో తనతోపాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. రాములు, పి. రంగయ్య తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.