దాంపత్య జీవితానికి దూరంగా ఉంచుతుందని...
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ
పావని కేసులో వీడిన మిస్టరీ
దుండిగల్, న్యూస్‌లైన్: దాంపత్య జీవితానికి దూరంగా ఉంచుతుందని ఆగ్రహించిన భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించాడు. చివరికి నిజాలు వెలుగులోకి రావడంతో కటకటాపాలైయ్యాడు. సోమవారం దుండిగల్ సీఐ బాలకృష్ణ కేసు వివరాలు వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు మండలం మొగల్లు గ్రామానికి చెందిన పెనుమత్స సుబ్రహ్మణ్య కుమార్రాజు(28)కు అత్తిలి మండలం ఈడూరుకు చెందిన పావని(22)తో 2013 ఫిబ్రవరి 13న వివాహమైంది. నాలుగు నెలల క్రితం సుబ్రహ్మణ్య రాజు భార్య పావని, తన తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చి బాచుపల్లి రామచంద్రారెడ్డినగర్లోని వైష్ణవి సాయిరెసిడెన్సీ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో అద్దెకుంటున్నాడు. సుబ్రహ్మణ్యరాజు ఖాజిపల్లిలోని ప్రసాద్ స్టోన్ క్రషర్లో సూపర్వైజర్. అతని తండ్రి సూర్యనారాయణరాజు అక్కడే మెస్‌లో పని చేస్తున్నారు.
కాగా పెళ్లైనప్పటి నుంచి పావని భర్తతో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటూ అతనంటే ఇష్టంలేనట్టు ఉండేది. గతేడాది డిసెంబర్ 24న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్య రాజు కోరిక తీర్చమని అడిగాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురై బలంగా కొట్టడంతో తలకు గాయాలై స్పృహ కోల్పోయింది. చనిపోయిందని భావించి చీరతో ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం దోపిడీ దొంగల పనిగా ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసి బయట నుంచి తలుపు గడియపెట్టి వెళ్లిపోయాడు.
ఇంటికి తిరిగి వచ్చి ఏమీ తెలియనట్టుగా భార్య మృతదేహం వద్ద విలపించాడు. కాగా, పావని మృతదేహాన్ని ఈడూరుకు తరలించగా అక్కడికి వెళ్లిన సుబ్రహ్మణ్య రాజుపై మృతురాలి బంధువులు దాడి చేసి నిలదీయడంతో తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. అనంతరం ఇదే విషయాన్ని అత్తిలి పోలీసులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించగా వారు పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా హత్యగా గుర్తించి సుబ్రహ్మణ్యరాజును సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.