వ్యయం జాస్తి సాయం నాస్తి
అరకొరగా విత్తనాల సరఫరా
నెల్లిమర్ల: సోమవారం ఉదయం ఏఓ సూరినాయుడు, ఏఈఓ ఉషారాణి క్షేత్రస్థాయికి వెళ్లారు. మరో ఏఈఓ ప్రశాంతి కార్యాలయంలోనే ఉండి రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు స్లిప్పులు రాస్తున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న 56 గ్రామాల్లో ఈ ఖరీఫ్‌లో మొత్తం ఆరువేల ఎకరాల్లో వరి పంట వేసేందుకు సిద్ధమయ్యారు. వరిసాగు చేసే రైతులకు అవసరమయ్యే విత్తనాలు మొత్తం వెయ్యి క్వింటాళ్లు కాగా ఇప్పటిదాకా కేవలం 360 క్వింటాళ్లు మాత్రమే సబ్సిడీపై సరఫరా చేసేందుకు మండలానికి వచ్చా యి. మొక్కజొన్న సాగు చేసే రైతులకు సైతం విత్తనాలు అందుబాటులో లేవు. ఇప్పటిదాకా ప్రభుత్వం మొక్కజొన్న విత్తనాలపై సబ్సిడీ ప్రకటించలేదు. దీంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
డెంకాడ: డెంకాడ మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సోమవారం ఉదయం 10.15 గంటలకు ఏఈవో భాను తెరిచారు. మరో ఏఈఓ జగన్నాథం చొల్లంగిపేట రైతుల అవసరాలపై అక్కడకు వెళ్లారు. మరో ఏఈవో ప్రశూతి సెలవుపై ఉన్నారు. మండల వ్యవసాయాధికారి హరిక్రిష్ణ రాలేదు. 1001, నెల్లూరి సన్నాలు, రాగోలు సన్నాలు వంటి వరి విత్తనాలు మినహా, ఈ ప్రాంతంలో ఎక్కువగా వేసే సోనామసూరి, స్వర్ణ రకం విత్తనాలు లేవు. వేరుశనగ విత్తనాలు సమయం మించినా ఇంకా రాలేదు. ఇక్కడ ఐదుగురు ఏఈఓలు ఉండేవారు. ఇప్పుడు ముగ్గురే ఉన్నారు.
పూసపాటిరేగ: ఖరీఫ్ సీజనుకు సంబంధించి సబ్సిడీపై వచ్చిన వరి విత్తనాలు అరకొరగానే వచ్చాయి. వ్యవసాయ అధికారి తిరుపతిరావు సెలవులో ఉన్నారు. విస్తరణాధికారులు శ్రీలక్ష్మి ,సూర్యప్రకాశరావులు కార్యాలయంలోనే ఉన్నారు. విస్తరణాధికారి రామకోటి ఫీల్డ్‌లో ఉన్నారు. మండలంలో 350 బస్తాల సాంబమసూరి, 120 బస్తాల 1001 మాత్రమే సబ్సిడీలో ఉన్నాయి.
సిబ్బంది కొరత
చీపురుపల్లి: మండలానికి నలుగురు వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. చీపురుపల్లిలో గల వ్యవసాయ కార్యాలయానికి రోజుకి 50 నుంచి వంద మంది వరకు వస్తున్నారు. ఏఓ కార్యకలాపాలు చక్కగా ఉన్నాయి. ప ర్మిట్లు రాసేందుకు ఒకే ఏఈఓ అయిపోవడంతో వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులకు జాప్యం జరుగుతోంది. కార్యాలయానికి వస్తున్న రైతులకు ఏ రకం విత్తనాలు మంచివో వివరించడం ఏఈఓనే చూసుకోవాలి.
మెరకముడిదాం: మండ లానికి చెందిన ఇన్చార్జి వ్యవసాయాధికారి కె.అరుణ్‌కుమార్ గరివిడి ఫుల్‌చార్జ్ కావడంతో మండలానికి చెందిన రైతులకు అందుబాటులో ఉండలేకపోతున్నారు. మండలానికి చెందిన ఏఈఓలు ముగ్గురు ఉన్నారు. వాళ్లు ముగ్గురు ప్రతీరోజు వ్యవసాయకార్యాలయంలో రైతులకు అందుబాటులో ఉంటున్నారు. సోమవారం వ్యవసాయాధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకూ వ్యవసాయ కా ర్యాలయాన్ని తెరవలేదు. మెరకముడిదాం గ్రామంలో 10 గ్రామాలకు చెందిన రైతులకు అవ గాహన సదస్సును నిర్వహించడంతో 12.30 కు కార్యాలయాన్ని తెరిచారు. గరివిడి(చీపురుపల్లి రూరల్): గరివిడిలో వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయాధికారి ఉన్నా లేనట్టేనని రైతులు తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు వ్యవసాయాధికారులు ఎవరూ లేరు.
పది మంది రైతులు అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు మూడు రోజులుగా ఖరీఫ్‌లో సాగుచేసే విత్తనాల కోసం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాత్రం కనిపించటం లేదని రైతులు చెబుతున్నారు. గుర్ల: రైతుల కోసం మండల కేంద్రం గుర్లలో ప్రభుత్వ పక్కా భవనంతో కూడిన వ్యవసాయ కార్యాలయం అందుబాటులో ఉంది. ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఒక ఏఈఓ పోస్టు ఖాళీగా ఉంది. సలహాలు, సూచనల కోసం సుమారు 20 నుంచి 30 మంది రైతులు వస్తుంటారు. అలాగే విత్తనాల సీజనులో 200 నుంచి 300 మంది వస్తుంటారు.
అధికారులున్నా లాభం లేదు...
నా పేరు మడపాన నారాయణరావు. నాది వెదుళ్లవలస గ్రామం. గత మూడు రోజులుగా వరి విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయానికి తిరుగుతున్నాను. ఎప్పుడు వచ్చినా అధికారులు కనిపించడం లేదు. రోజూ ఇదే తంతు. వ్యవసాయాధికారుల నుంచి ఏమాత్రం సలహాలు, సూచనలు అందటం లేదు.
అతి కొద్దిమందికే...
విజయనగరం రూరల్ : మండల పరిధిలో సుమారు 12 వేల మంది రైతులు ఉండగా వీరిలో వ్యవసాయాధికారులను సలహాలకు సంప్రదించేది అతికొద్ది మంది మాత్రమే. మండలం లో ఒక వ్యవసాయాధికారి, ముగ్గురు వ్యవసాయ విస్తరణాధికారులు పనిచేస్తున్నా రు. గ్రామాలకు వెళ్లి పంటలు, ఎరువుల వాడకంపై సలహాలు ఇవ్వాల్సిన వ్యవసాయాధికారులు కేవలం ఖరీఫ్ సీజన్‌కు ముందు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పంట నష్ట సమయంలో ఆదర్శ రైతులు కాంగ్రెస్ పార్టీకి, వారి కుటుంబ సభ్యులకే పంటనష్ట పరిహారం అందేలా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో ఐదు వేల ఎకరాల్లో పల్లం భూములు, నాలుగు వేల ఎకరాల్లో మెట్టు భూములు ఉన్నాయి. ఖరీఫ్‌లో విత్తనాల సరఫరాపై గ్రామ గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించాల్సిన అధికారులు ఐదారు గ్రామాలకు ఒకే చోట సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
అందుబాటులో అధికారులు
బొబ్బిలి రూరల్: మండల వ్యవసాయశాఖాధికారి కార్యాలయానికి రైతులు సలహాల కోసం రోజూ పది మంది వరకు వస్తుంటారు. ఎరువులు ఎంత మోతాదులో వేయాలి? ఈ వాతావరణంలో విత్తనాలు నాటవచ్చా? ఏయేరకాలు ఈ ప్రాంతానికి అనుకూలం? నెల్లూరు సన్నాలు చీడలకు తట్టుకోగలవా? వంటి సందేహాలు రైతులు సోమవారం వ్యక్తం చేశారు. మండల వ్యవసాయశాఖాధికారిగా ఏ.రవీంద్ర వ్యవహరిస్తుండగా, ఆయన సోమవారం విజయనగరంలో జేడీతో సమావేశానికి వెళ్లారు. ఆయన సేవలపై రైతులు సంతృప్తి వ్యక్త ంచేస్తున్నారు. అలాగే ముగ్గురు ఏఈఓలు జోగినాయుడు, రామమూర్తి, కిరణ్‌కుమార్‌లు ఉన్నారు. సోమవారం ఇద్దరు ఏఈఓలు విత్తనాల పంపిణీకి మనగ్రోమోర్ సెంటర్‌కు వెళ్లగా ఏఓ కార్యాలయంలో ఏఈఓ కిరణ్‌కుమార్ అందుబాటులో ఉన్నారు. తెర్లాం రూరల్: తె ర్లాంలోని మండల వ్యవసాయ కార్యాలయం సోమవారం ఉదయం 10 గంటలకు తెరచి ఉంది. మండల వ్యవసాయ అధికారి బి. శ్రీనివాసరావు, ఏఈఓ తమ్మినాయుడులు విధుల్లో ఉన్నారు.
రఘు, ఇందిర అనే మరో ఇద్దరు ఏఈఓలు 10.15 గంటలకు కార్యాలయానికి వచ్చి, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. 1001 రకం వరి విత్తనాల కోసం మండలంలోని కొల్లివలస, పూనువలస, లోచర్ల, కుమ్మరిపేట, కాలంరాజుపేట గ్రామాల నుంచి రైతులు వ్యవసాయ కార్యాలయానికి వచ్చారు. విత్తన శుద్ధి తప్పని సరిగా చేయాలని ఏఓ రైతులకు సలహా ఇచ్చారు. బాడంగి: రైతులకు అవసరమైన వరి విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్నారు. విత్తనాల కోసం సోమవారం గొల్లాది, పెదపల్లి, వీరసాగరం,పిండ్రంగివలస, కోడూరు,రావివలస, గూడెపువలస, మళ్లంపేట గ్రామాలకు చెందిన సుమారు 12 మంది రైతులు కార్యాలయానికి చేరుకుని అధికారుల కోసం వేచి చూస్తున్నారు. అధికారులు సమయపాలన పాటించడం లేదని రైతులు చెబుతున్నారు.
రామభద్రపురం : స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సోమవారం రైతులు బారులు తీరారు. దీనిపై ఆందోళన కార్యక్రమం జరుగుతుందని వ్యవసాయ అధికారి చిం తాడ ప్రసాద్ పోలీసుల సహాయంతో మూడో విడతగా వచ్చిన 1001 వరి విత్తనాలను 540 బస్తాలను పంపిణీ చేశారు. ఒక్కో పాస్ పుస్తకానికి ఒక బస్తా ఇస్తామని ఏఓ తెలుపగా దానికి మించి కావాలని ఎక్కువ భూమి ఉన్న వారు అడిగారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విత్తనాలను సరఫరా చేయాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏఓ ప్రసాద్‌ని వివరణ కోరగా 100 క్వింటాళ్లు ఈ ఏడాది తక్కువగా సరఫరా చేసింద ని త్వరలో వాటి ని తీసుకొచ్చి రైతులకు అందిస్తామన్నారు.