కిచెన్ గార్డెనింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సాక్షి మీడియా సంయుక్తాధ్వర్యంలో నిర్వహణ
పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
సబ్సిడీపై కిట్ల పంపిణీ
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్‌లో శనివారం జరిగిన కిచెన్ గార్డెనింగ్ వర్క్‌షాప్‌నకు విశేష స్పందన లభించింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సాక్షి మీడియా సంయుక్తంగా నిర్వహించిన ఈ వర్కషాప్నకు పిల్లలు, వారి తల్లిదండ్రులు, స్థానికులు, ఇతరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రసాయనాలతో తలెత్తే ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకునే అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరిచారు. ఇందుకు సంబంధించి పలు వివరాలను అధికారులను, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ విభాగం అధికారి అరుణ సబ్సిడీ కిట్ గురించి వివరించారు. ఈ కిట్‌లో కిచెన్ గార్డెనింగ్‌కు అవసరమైన పరికరాలు ఉన్నాయన్నారు. రూ.6 వేల విలువ కలిగిన ఈ కిట్‌ను సబ్సిడీ పోనూ రూ.3 వేలకే అందజేస్తున్నామని ఆమె తెలిపారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం నుంచి రిసోర్స్ పర్సన్‌గా వచ్చిన చంద్రశేఖర్ కిచెన్ గార్డెన్లో తలెత్తే ఇబ్బందులు వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు అందజేశారు.
కిచెన్ గార్డెనింగ్ సబ్సిడీ కిట్ అందుకున్న వారికి ఫాలోఅప్ మీట్స్ నెలనెలా నిర్వహించి వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని సాక్షి టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణీ రెడ్డి తెలిపారు. ప్రతి నెలా జరిగే పేరెంట్స్ మీట్లో భాగంగా అదనపు గంట నిర్వహించిన ఈ వర్క్‌షాపునకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. స్కూల్ పిల్లల్లో కూడా కిచెన్ గార్డెనింగ్ అలవాటును పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు.