వృద్ధి లక్ష్యాన్ని దాటేస్తాం..
♦ రాజకీయపరమైన అడ్డంకులేమీ లేకుంటే సుసాధ్యమే
♦ సబ్సిడీ బిల్లు భారం మరింత తగ్గుతుంది
♦ పరిశ్రమ వర్గాలతో భేటీలో
♦ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా
న్యూఢిల్లీ: రాజకీయపరమైన ఆటంకాలేమీ ఎదురవకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 7-7.75 శాతం వృద్ధి లక్ష్యాన్ని సునాయాసంగానే అధిగమించగలమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయపరమైన ఆటంకాలు తగ్గి, కీలకమైన జీఎస్టీ, దివాలా చట్టాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వానికి తోడ్పాటు ఉంటే ఇది సుసాధ్యమేనని ఆయన చెప్పారు. బడ్జెట్ అనంతరం దేశీ పరిశ్రమ దిగ్గజాలతో బుధవారం సమావేశమైన సందర్భంగా జైట్లీ ఈ విషయాలు వివరించారు. ‘గత ఏడాదిలోలాగా రాజకీయపక్షాల నుంచి అడ్డంకులేమీ ఎదురవకుండా బడ్జెట్లో ప్రతిపాదించినట్లు మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టగలిగితే.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ పేర్కొన్న వృద్ధి లక్ష్యాలను మించి సాధించగలమన్న ధీమా ఉంది’ అని ఆయన చెప్పారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) బిల్లు, దివాలా బిల్లు మొదలైనవి పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయని, వాటి ఆమోదం కోసం కృషి చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల అమలు, ప్రజా సంక్షేమ పథకాల వ్యయాలు పెంచే క్రమంలో కూడా ప్రభుత్వం ఆర్థిక స్థిరీకరణకు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. దేశ, విదేశ పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను కల్పించే సమయంలో కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని జై ట్లీ చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా చెప్పుకోజాలమన్నారు.
పీఎస్బీలకు మద్దతునిస్తాం..
ప్రభుత్వ రంగ బ్యాంకులు సజావుగా పనిచేసేలా అవసరమైన వనరులన్నీ సమకూరుస్తామని, అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్, మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశాలు పరిశీలిస్తామన్నారు. ఇక రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ కేసుల పరిష్కారం దిశగా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఒకడుగు ముందుకేసిందని జైట్లీ చెప్పారు. పాత లావాదేవీలను తిరగదోడి పన్నులు విధించే రెట్రాస్పెక్టివ్ విధానం కింద వొడాఫోన్, కెయిర్న్ ఇండియా తదితర సంస్థలు వేల కోట్ల పన్ను నోటీసులు అందుకోవడం, వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెలిసిందే.
ఈపీఎఫ్ పన్నుపై బడ్జెట్ చర్చలో స్పష్టత..
ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) నుంచి విత్‌డ్రా చేసుకునే కొంత మొత్తంపై పన్ను విధింపు అంశానికి సంబంధించి బడ్జెట్‌పై చర్చలో తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని జైట్లీ చెప్పారు. అత్యధిక వేతనాలు అందుకుంటున్న వారిని ఉద్దేశించే ఈ చర్య ప్రతిపాదించడం జరిగిందని ఆయన తెలిపారు. ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ నిధి నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40%కి పన్ను మినహాయించి మిగిలిన 60%పై పన్ను విధించాలన్న బడ్జెట్ ప్రతిపాదనపై ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి తీవ్ర విమర్శలు చెలరేగడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగడం తెలిసిందే. ఈపీఎఫ్ నుంచి తీసుకునే 40%పై పన్ను భారం ఉండదని, మిగిలిన 60% మొత్తాన్ని పెన్షన్ అందించే యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి పన్ను భారం ఉండదని పేర్కొంది.
8 శాతంపైన వృద్ధికి కృషి: శక్తికాంత్ దాస్
ఎనిమిది శాతం ఎగువ స్థాయి వృద్ధి నమోదుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుం టుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ అన్నారు. సీఐఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేకించి ఈ దిశలో సంస్కరణల బాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వస్తు సేవల పన్ను, దివాలా చట్టాలకు సాధ్యమైనంత త్వరగా పార్లమెంటు ఆమోదం లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, వచ్చే ఏడాదే 8 శాతం వృద్ధి ప్రభుత్వం లక్ష్యం. పెట్టుబడుల వాతావరణం నెమ్మదిగా మెరుగుపడుతుందని భావిస్తున్నామని చెప్పారు. మౌలిక రంగంలో పెట్టుబడులు, గ్రామీణ భారత పురోగతికి తీసుకుంటున్న చర్యలు దేశీయ డిమాండ్‌ను పెంచనున్నాయని, పన్ను యేతర ఆదాయాలు పెరగడంపైనా దృష్టి సారిస్తామని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు తమ వద్ద ఉన్న నిధులను నిరుపయోగంగా అట్టే పెట్టుకోకుండా తగిన చర్యలు ఉంటాయని, స్పెషల్ డివిడెండ్‌గా దీనిని తీసుకుని బ్యాంకులకు తాజా మూలధనం, ఇన్ఫ్రాకు ఈ నిధులను వినియోగించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగం సంస్థల్లో మెజారిటీ (వ్యూహాత్మక) వాటాల విక్రయం ద్వారా రూ.20,500 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.