వెసులుపాటు!
ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాక్కోవడమంటే ఇదే.. గ్యాస్-ఆధార్ అనుసంధాన గడువును పెంచి వెసులుబాటు కల్పించినట్లు ఫోజిలిచ్చిన ప్రభుత్వం అదే చేత్తో సబ్సిడీని లాగేసుకుంది. కొత్త సంవత్సరం రోజే గ్యాస్ ధర భారీగా పెంచేసి వినియోగదారులను గ్యాస్ బండతో బాదిన సర్కారు అక్కడితో ఊరుకోలేదు. ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి గడువు ఇస్తూనే.. సబ్సిడీ కొనసాగింపు విషయాన్ని ప్రస్తావించకుండా మౌనం వహించింది. ఫలితంగా అనుసంధానం చేసుకోని వారికి డిసెంబర్ 31 తర్వాత నగదు రాయితీ కట్ చేయాలన్న పాత ఉత్తర్వులే వర్తిస్తాయని భాష్యం చెబుతున్న డీలర్లు ఆ మేరకు బిల్లింగ్ కూడా ప్రారంభించేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇప్పటివరకు కేంద్రం, చమురు సంస్థలు ఇచ్చిన వెసలుబాటుతో ఆధార్ అనుసంధానం చేసుకోకపోయినా సబ్సిడీ రేటుకే గ్యాస్ సిలెండర్ అందుకుంటున్న వినియోగదారులకు ఊహించని పిడుగుపాటు. తాజాగా కొత్త సంవత్సరం రోజునే గ్యాస్ ధర పెంచడంతోపాటు అనుసంధాన గడువును ఫిబ్రవరి 28 వరకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో మరో రెండు నెలలు బ్యాంకులతో నిమిత్తం లేకుండా ఇంటి వద్దే పూర్తి సబ్సిడీ రేటుకే సిలిండర్ అందుకోవచ్చని ఆశించినవారికి ఈ రెండు నెలలు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ విడిపించుకోవడం పెను భారమే. గడువు పెంచుతూ మొబైల్ ఆదేశాలు జారీ చేసిన చమురు సంస్థలు సబ్సిడీ కొనసాగింపు విషయం మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై స్పష్టత కోసం గురువారం రాత్రి వరకు ఎదురు చూ సిన గ్యాస్ ఏజెన్సీలు.. పాత జీవో ప్రకారం.. అంటే డిసెంబర్ 31లోగా అనుసంధానం చేసుకోని వారికి ఈ నెల నుంచి నగదు సబ్సిడీ ఇవ్వరాదన్న ఉత్తర్వుల అమలకే సిద్ధమయ్యారు. దీని ప్రకారం ఇంతవరకు సబ్సిడీ మొత్తం పోను మిగిలిన సొమ్ము మాత్రమే చెల్లించి సిలిండర్ విడిపించుకుంటున్న వినియోగదారులు, ఈ నెల నుంచి మార్కెట్ ధర ఎంతుంటే అంతా చెల్లించి విడిపించుకోవాలి.
జిల్లాలో ఇప్పటికీ ఆధార్ అనుసంధానం చేసుకోని 63,122 మందికి ఇది పెనుభారం కానుం ది. సగటున నెలకు * 5.05 కోట్ల అదనపు భారం పడింది. ఈ మేరకు శుక్రవారం నుంచి గ్యాస్ ఏజెన్సీలు బిల్లింగ్ ప్రారంభించాయి. జిల్లాలో 2,95,487 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 63,122 మంది ఇంకా ఆధార్ అనుసంధానం చేసుకోకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆధార్ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగకపోవడం, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా విశిష్ట సంఖ్యతో కూడిన కార్డులు ఇంకా జారీ కాకపోవడం వంటి కారణాలకు తోడు ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు జత చేయడంలో బ్యాంకర్ల నిర్లక్ష్య వైఖరి కూడా అనుసంధానం లో జాప్యానికి దారి తీస్తోంది. వీటన్నింటినీ పట్టించుకోకుండా అనుసంధానం చేసుకోలేదన్న సాకుతో సబ్సిడీ కట్ చేయడం దారుణమని వినియోగదారులు వాపోతున్నారు.
ఇక నుంచి చెల్లింపులు ఇలా..
కొత్త బిల్లింగ్ ప్రకారం సిలిండర్ ధర వసూలు చేసే విధానం ఇలా ఉంటుంది. జనవరి ఒకటికి ముందు ఆధార్ అనుసంధానం చేసుకోని వినియోగదారులకు సబ్సిడీ మినహాయించి రూ.411కే సిలిం డర్ అందజేసేవారు. కొత్త విధానంలో సబ్సిడీ ఉండదు కను క.. పెంచిన ధరతో కలుపుకొని మొత్తం రూ.1316 చెల్లిస్తేనే సిలిండర్ అందజేస్తారు. అంటే ఒక్కసారి రూ.905 భారం పడిందన్నమాట.
ఇక ఇప్పటికే అనుసంధానం చేసుకొని నగదు బదిలీ పథకం పరిధిలోకి వచ్చిన వారు సిలిండర్ విడిపించుకున్నప్పుడు పూర్తి సొమ్ము చెల్లిస్తే.. సబ్సిడీ మొత్తం వారి బ్యాంకు ఖాతాకు జమ అవుతున్న విషయం తెలిసిందే. ధర పెరిగిన నేపథ్యంలో సిలిండర్ విడిపించుకున్నప్పుడు 1316 చెల్లించాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తం 800 వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ఈ లెక్కన వీరికి రూ.516కే గ్యాస్ అందుతుందన్నమాట.