కుటుంబ వివాదంతో గోదారిలో దూకిన వివాహిత
నదిలో గల్లంతు
గాలింపు చర్యలు
రాజోలు :
భార్య, భర్తల మధ్య వివాదం తలెత్తడంతో రాజోలు మండలం ములికిపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల వివాహిత వాసంశెట్టి ప్రియాంక శుక్రవారం చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకేసింది. దాంతో ఆమె కోసం బంధువులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రియాంక దూకిన వంతెన ప్రదేశం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి పోలీసు స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు, ములికిపల్లి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాజోలు మండలం ములికిపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక, అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి మణికంఠకుమార్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో రెండు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా ఇద్దరూ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మణికంఠకుమార్ హైదరాబాద్‌లో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు.
ఆ క్రమంలో మణికంఠకుమార్ కుటుంబ సభ్యులు వీరిని వరలక్ష్మీ పూజ చేసుకునేందుకు ములికిపల్లి రావాలని ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం గ్రామం వచ్చిన ప్రియాంక, మణికంఠకుమార్ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి. వరలక్ష్మీ వ్రతం చేసుకున్న తర్వాత ప్రియాంక మోటార్ సైకిల్ వేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం వెతుకుతున్న సమయంలో చించినాడ వంతెనపై మోటార్ సైకిల్, ప్రియాంక చెప్పులను బంధువులు గుర్తించారు. ఆమె గోదావరిలో దూకేసిందనే అనుమానంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి పోలీసులు వివాహిత అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.