పోలీసుల అదుపులో ఇద్దరు విదేశీయులు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన రహదారిపై అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఇద్దరు సుడాన్ దేశీయులను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఎయిర్‌పోర్టు రక్షణ సిబ్బంది ఒడిశా రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారును గమనించారు. కారును తనిఖీ చేయగా.. అందులో ఇద్దరు సూడాన్ దేశీయులు కనిపించారు.
వారి వద్ద కారుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు, పాస్‌పోర్టు, వీసాలు కానీ లేకపోవడంతో వెంటనే ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు కారుతో పాటు విదేశీయులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వరంగల్ లోని ఓ యూనివర్సిటీలో మూడేళ్ళ కోర్సు చదివేందుకు ఆరు నెలల క్రితం హైదరాబాద్ వచ్చామని చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.